Medaram: భక్తుల భద్రతే లక్ష్యం.. మంత్రి సీతక్క కీలక సూచనలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-28 07:22:32  IST  )

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో నిర్వహించిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు వేడుకలో మంత్రి సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Medaram: భక్తుల భద్రతే లక్ష్యం.. మంత్రి సీతక్క కీలక సూచనలు
X

దిశ, కొత్తగూడ:మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో నిర్వహించిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు వేడుకలో మంత్రి సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వన దేవతలు సమ్మక్క–సారలమ్మల చల్లని దీవెనలు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని గిరిజన ఆత్మగౌరవానికి, పోరాట చరిత్రకు ప్రతీకగా నిలిచిన మేడారం మహాజాతరను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కోటిన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి జాతరపై ప్రత్యేక దృష్టి సారించి ఫోన్ ద్వారా మాతో,అధికారులతో మాట్లాడారని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించరాని జాతర శాశ్వత అభివృద్ధిలో భాగంగా రూ.250 కోట్ల వ్యయంతో ఆలయ ప్రాకార విస్తరణతో పాటు సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను విశాలంగా నిర్మించినట్లు మంత్రి గుర్తుచేశారు.

లక్షలాదిగా మేడారం చేరుకుంటున్న భక్తులకు రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. భక్తులు, వాహనదారులు పోలీసు శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని, క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. వృద్ధులు, మహిళలు, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.జాతర భద్రత కోసం 13 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ పర్యవేక్షణలో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి అన్నారు.

READ MORE .....

మహా జాతర ప్రారంభం.. దారులన్నీ మేడారం వైపే

Next Story