కేసీఆర్ జగిత్యాల సభపై కవిత సెటైర్లు

by Malleboina Mahesh |   (  Updated:2026-04-21 13:05:31  IST  )

కల్వకుంట్ల కవిత కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు తెలుపుతూ, యువతకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ జగిత్యాల సభపై కవిత సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సోమవారం జగిత్యాలలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై ఆయనను పార్టీలో చేర్పించుకొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కాగా ఈ సభపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuṇṭla kavita) సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రజా ఆశీర్వాద సభ'పై ఆమె ఘాటుగా స్పందించారు. జగిత్యాల సభలో కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కవిత సెటైర్లు వేశారు. "75 ఏళ్లు వచ్చిన వ్యక్తి నవ యువకుడైతే.. రాష్ట్రంలోని లక్షలాది మంది యువకులు ఏమవ్వాలి?" అని ఆమె ప్రశ్నించారు.

యువత ఆకాంక్షలను గుర్తించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదని, ఆ పార్టీ కేవలం స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తోందని కవిత ఆరోపించారు. మమ్మల్ని ఓడించి ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అనడం సరికాదని, ప్రజల తీర్పును గౌరవించకుండా వారిని తప్పుబట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ సభలో 'ఉట్టి కథలు' చెప్పారని, కాంగ్రెస్ 'పిట్ట కథలు' చెబుతోందని.. కానీ ప్రజల అసలు కష్టాల గురించి ఎవరూ మాట్లాడటం లేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ ప్రజల గొంతుక అవుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీకి కవిత విజ్ఞప్తి...

ఏప్రిల్ 25న మేడ్చల్‌లో తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు కవిత ఇప్పటికే ప్రకటించారు. ఈ పార్టీలో యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామని, ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కొత్త పార్టీ వస్తున్న నేపథ్యంలో పబ్లిసిటీ మెటీరియల్ (ప్లెక్సీలు, బ్యానర్లు) విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని ఆమె కోరారు. ప్రజాస్వామ్యంలో కొత్త శక్తులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు

కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు భయపడం: బీఆర్ఎస్‌కు మంత్రి పొన్నం కౌంటర్

Next Story