రేవంత్​ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి : కూనంనేని సాంబశివరావు

by Malleboina Mahesh |

హైడ్రా పేరుతో పేదల గుడిసెల కూల్చివేతలపై ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల మహాధర్నా.. సీఎం రేవంత్ రెడ్డికి కూనంనేని సాంబశివరావు హెచ్చరిక!

రేవంత్​ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి : కూనంనేని సాంబశివరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పేదల జోలికి వస్తే ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టదని, పాలకులు మారినా పేదల బతుకులు మారడం లేదని, కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విరుచుక పడ్డారు. పోలీసు యంత్రాంగం, బుల్డోజర్లు చేతిలో ఉన్నాయని పేదల గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలనే నినాదం తో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వెలుగుమట్ల, హనుమకొండలోని గుండ్ల సింగారం, గోపాలపురం, మహబూబాబాద్, యాదాద్రి జిల్లా కొలనుపాక, చేవెళ్ల, అబ్దుల్లాపూర్ అశ్వారావుపేట వంటి ప్రాంతాల్లో వరుసగా జరిగిన కూల్చివేతలను తీవ్రంగా ఖండించారు.

భూదాన్ భూములు, ప్రభుత్వ భూములను ల్యాండ్ మాఫియా దొంగల్లా దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, మరో వైపు నోరు లేని మూగజీవాల్లాంటి పేదలు తలదాచుకోవడానికి గుడిసె వేసుకుంటే మాత్రం కూల్చేస్తున్నారు. ప్రభుత్వానికి అంతగా సమర్థత ఉంటే, ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి ఎన్ని వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారో శ్వేతపత్రం’ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా’ పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయవద్దని, కబ్జాకోరులను జైల్లో పెట్టడితే తాము స్వాగతిస్తామన్నారు. కమ్యూనిస్టులుగా పోరాటం చేస్తే డిమాండ్లను అమలు చేస్తామని ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వకుండా, వారి నివాసాలను కూల్చివేయడం అన్యాయమని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.

గత ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ పేరుతో ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం ‘ఇందిరమ్మ రాజ్యం’, ‘ప్రజా ప్రభుత్వం‘ పేరుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. రెండున్నరేళ్లుగా వామపక్ష పార్టీలు శాసనసభలో, ప్రజా ఉద్యమాల ద్వారా ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. భూదాన్ భూములు, కోర్టు కేసులు వంటి కారణాలు చూపుతూ కాలయాపన చేస్తూనే, మరోవైపు గుడిసెల కూల్చివేతలు చేపడుతోందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడిచినా పేదలకు కనీసం నివాస స్థలం కల్పించలేకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని అన్నారు. ఈకార్యక్రమంలో పశ్య పద్మ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, ఈ.టి.నరసింహా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి.అబ్బాస్, వామపక్షాల నాయకులు వనం సుధాకర్ , కె.గోవర్థన్ , సదానంద్ , భరత్, మూడ్​గణేష్, సాధినేని వెంకటేశ్వర్లు, జ్యోతి ప్రసంగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ

రాష్ట్రంలో ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు సొంత ఇళ్లు లేవని, హైదరాబాద్ 60 శాతం మంది అద్దె ఇళ్లలోనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గుడిసెల కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని, పేదలను రోడ్డున పడేయవద్దన్నారు. గుడిసెల కూల్చివేతలు కొనసాగితే బుల్డోజర్లకు ఎదురొడ్డి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు పేదల ఇళ్ల సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. పేదలు, శ్రామికవర్గం ఐక్యంగా పోరాడి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story