2 లక్షల ఉద్యోగాల హామీపై శ్వేతప్రతం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Malleboina Mahesh |

బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

2 లక్షల ఉద్యోగాల హామీపై శ్వేతప్రతం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 20 వేల పోలీస్ ఖాళీలకు గాను కేవలం 7,437 పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జీవో 46 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రకటన నిరుద్యోగ యువతలో తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు దారితీసిందన్నారు. గత కొన్నేళ్లుగా రాత్రింబగళ్లు కష్టపడుతూ, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నెం.46 కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి వంటి అర్బన్ కమిషనరేట్ పరిధిలోనే మెజారిటీ పోస్టులు కేటాయించబడుతున్నాయని, గ్రామీణ విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట, గద్వాల వంటి వెనుకబడిన జిల్లాలకు చెందిన అభ్యర్థులు అత్యధిక మార్కులు సాధించినప్పటికీ, స్థానికంగా పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. ఒకే పరీక్ష రాసినప్పటికీ ప్రాంతాల వారీగా వేర్వేరు కటాఫ్ మార్కులు ఉండటం, గ్రామీణ యువత పట్ల వివక్ష చూపడమేనని ప్రశ్నించారు.

Next Story