- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సిద్దిపేట కరకపట్లలో రూ.800 కోట్లతో నిర్మించిన దేశంలోనే తొలి ‘ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ ప్లాంట్’ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు!

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను అవకాశాలుగా అందిపుచ్చకునేలా.. తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కరకపట్ల లోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో రూ.800 కోట్లతో సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశోధన, సాంకేతికత, ఏఐ, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ధిని సమన్వయం చేస్తూ.. భవిష్యత్తులో హెల్త్ కేర్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.
జహీరాబాద్ నిమ్జ్‌ను మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఫార్మా అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వెల్లడించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని.. పర్యావరణహిత పద్ధతుల్లో ఔషధాలను ఉత్పత్తి చేసేలా పరిశ్రమలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్–2047, నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా పరిశోధన నుంచి ఉత్పత్తి వరకు అన్ని దశలను అనుసంధానించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బయోలాజిక్స్, బయోసిమిలర్స్, సెల్ అండ్ జీన్ థెరపీలు, ఏఐ, డిజిటల్ హెల్త్ తదితర అత్యాధునిక రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
తాజాగా ప్రారంభించిన ఈ ప్లాంట్‌లో అత్యాధునిక కంటైన్‌మెంట్ టెక్నాలజీని ఉపయోగించి.. క్యాన్సర్ నివారణకు సంబంధించిన ఓరల్ ఆంకాలజీ ఔషధాలు, స్టెరిలైజ్ ఇంజెక్టబుల్స్, లైయోఫిలైజ్డ్ పౌడర్ ఇంజెక్షన్లు, సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్‌ను ఉత్పత్తి చేస్తారన్నారు. కొత్తగా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు డా.గోవింద రెడ్డి, డా.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






