Loans: వాహన రుణాలను దాటేసిన బంగారు రుణాలు

by S Gopi |

సమీక్షించిన కాలంలో రుణాలను పెట్టుబడిదారులకు విక్రయించే మొత్తం సెక్యూరిటైజేషన్ జారీలు 22 శాతం పెరిగి రూ. 60,000 కోట్లకు చేరాయి.

Loans: వాహన రుణాలను దాటేసిన బంగారు రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ రుణ మార్కెట్‌లో గోల్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం వేగంగా పెరుగుతోంది. క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బంగారు రుణాలు తొలిసారిగా వాహన రుణాలను అధిగమించి అతిపెద్ద అసెట్ కేటగిరీగా నిలిచాయి. సమీక్షించిన కాలంలో రుణాలను పెట్టుబడిదారులకు విక్రయించే మొత్తం సెక్యూరిటైజేషన్ జారీలు 22 శాతం పెరిగి రూ. 60,000 కోట్లకు చేరాయి. ఇందులో గోల్డ్ లోన్స్ వాటా 31 శాతం ఉండగా, ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న వాహన రుణాల వాటా 26 శాతానికి పడిపోయింది. స్థిరమైన లోన్ డిమాండ్, పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న ఆసక్తి, వేగంగా నిధులు సమీకరించే అవసరం వల్ల ఎన్‌బీఎఫ్‌సీలు గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలను పెద్ద ఎత్తున సెక్యూరిటైజ్ చేస్తున్నాయని క్రిసిల్ తెలిపింది. ముఖ్యంగా 98 శాతం జారీలు ఎన్‌బీఎఫ్‌సీల నుంచే రావడం ఈ రంగంలో వాటి ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. గోల్డ్ లోన్స్‌లో నష్టాలు తక్కువగా ఉండటం, రిస్క్ తక్కువగా కనిపించడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వీటిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు, వ్యాపార రుణాలు, మైక్రోఫైనాన్స్ రుణాల సెక్యూరిటైజేషన్ కూడా పెరుగుతుండగా, హౌసింగ్ రుణాల వాటా తగ్గింది. రిటైల్ రుణాలపై డిమాండ్, పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగితే రాబోయే త్రైమాసికాల్లో కూడా సెక్యూరిటైజేషన్ మార్కెట్ ఇదే జోరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ అంచనా వేస్తోంది.

Next Story