Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు

by S Gopi |

‘ఫ్రెష్ పనీర్’ ఉత్పత్తిపై చేసిన యాడ్స్ నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మరోసారి కఠిన వైఖరి అవలంబించింది. ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విక్రయిస్తున్న ‘ఫ్రెష్ పనీర్’ ఉత్పత్తిపై చేసిన యాడ్స్ నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం, ‘ఫ్రెష్’ అనే పదాన్ని ఉపయోగించాలంటే షెడ్యూల్–5లో నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అయితే హెరిటేజ్ ప్రొడక్ట్ ఆ ప్రమాణాలను అందుకోలేదని, అయినప్పటికీ ‘ఫ్రెష్ పనీర్’గా ప్రచారం చేయడం వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా, ఉత్పత్తిపై ఉపయోగించిన ‘హెల్తీ హ్యాపీనెస్’ అనే బ్రాండింగ్‌లోని ‘హెల్తీ’ పదంపైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదం వల్ల ప్రొడక్ట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనే భావన వినియోగదారుల్లో కలిగే అవకాశం ఉందని, ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్–2018 నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. వినియోగదారుల ఫిర్యాదులు, అలాగే స్వీయ పరిశీలన (సుమోటో) ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఇటీవల ఆహార ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు, క్లెయిమ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ మరింత కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story