ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

by Malleboina Mahesh |

ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు వద్దు- విలీనమే ముద్దు అనే నినాదంతో ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింటెడ్ డే ప్రకటించాలని కోరింది. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలు యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీలోని అన్ని ట్రేడ్ యూనియన్లు, బీసీ, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ అసోసియేషన్ల ప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరై పలు కీలక తీర్మానాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొంది, గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందని గుర్తు చేశారు. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం అపాయింటెడ్ డేను ప్రకటించి జీవో విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు దానిని అమలు చేయకుండా యూనియన్ ఎన్నికల వైపు అడుగులు వేయడం చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని అన్ని యూనియన్లు అభిప్రాయపడ్డాయి.

అలాగే ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతూ లేబర్ కమిషనర్‌ను కలిసి అన్ని యూనియన్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. బహుజన వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు సాజిద్ మహమ్మద్, సుద్దాల సురేశ్, టీఎంయూ (అశ్వత్థామ రెడ్డి వర్గం) ప్రతినిధులు శంకర్, నిరంజన్, టీజేఎంయూ ప్రతినిధులు హన్మంత్ ముదిరాజ్, గోలి రవీందర్, ఎన్‌ఎంయూ ప్రతినిధులు మర్రి నరేందర్, సత్యం, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ) ప్రతినిధులు జక్కుల మల్లేశం గౌడ్, అబ్రహం, ఎస్టీఎంయూ ప్రతినిధి పున్న హరికిషన్, ఆర్టీసీ జేఏసీ సంఘాల ప్రతినిధి కమలాకర్ గౌడ్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి సురేష్, ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story