ఎస్ఐఆర్ సక్సెస్ కాదు: తలసాని శ్రీనివాస్‌యాదవ్

by Malleboina Mahesh |

తెలంగాణలో ఎస్‌ఐఆర్ (SIR) సర్వే సక్సెస్ కాదు.. గ్రేటర్ హైదరాబాద్‌లో 5 శాతం కూడా పూర్తి కాలేదన్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్!

ఎస్ఐఆర్ సక్సెస్ కాదు: తలసాని శ్రీనివాస్‌యాదవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎస్ఐఆర్ సక్సెస్ కాదని.. ఫామ్స్ సైతం సరిపడా లేవని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బీఎల్‌వోలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదని.. ఎస్ఐఆర్ ప్రక్రియలో సరిపడా సిబ్బంది లేరని ఆరోపించారు. 30 శాతం ఫామ్స్ ప్రజలకు అందలేదని.. ఫామ్ 6, 7 ఫారాలు అసలు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేట్ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో 5 శాతం కూడా ప్రక్రియ జరగలేదన్నారు. గ్రేటర్ పరిధిలో ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉన్నదని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అనుమానాలు ఉన్నట్లే.. తెలంగాణలోనూ అదే విధంగా అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి పది ఇళ్లకు ఒక అధికారిని పెట్టి ఎస్ఐఆర్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

రెజ్లర్లకు సహాయం అందిస్తా..

తన జీవితకాలం పాటు జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు హాజరయ్యే రెజ్లర్లకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నగరంలోని వ్యాయామశాలల నిర్వాహకులు, రెజ్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాయామశాలల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ నెల 24న తెలంగాణ భవన్‌లో మోడల్ రెజ్లింగ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌యాదవ్, పలువురు వ్యాయామశాలల నిర్వాహకులు, రెజ్లర్లు పాల్గొన్నారు.

Next Story