- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మోడ్రన్ టెక్నాలజీ.. 12 రోజుల్లో ఇల్లు రెడీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణంలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా 'షియర్ వాల్ టెక్నాలజీ' (Shear Wall Technology) ఉపయోగించి కేవలం 12 రోజుల్లోనే ఒక పక్కా ఇందిరమ్మ ఇంటి సివిల్ నిర్మాణాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించారు. సాధారణంగా ఇటుకలు, సిమెంట్‌తో ఇల్లు కట్టడానికి 2 నుండి 3 నెలల సమయం పడుతుండగా.. అధునాతన స్టీల్ ఫార్మ్‌వర్క్, కాంక్రీట్ మిశ్రమంతో అతి తక్కువ కాలంలోనే ఇళ్లు సిద్ధం కావడం గృహ నిర్మాణ రంగంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
సీఎ రేవంత్ రెడ్డి జూన్ 1న ఈ కొఠారి గ్రామంలో పర్యటించి ఆదివాసీల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రయోగాత్మక నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. ఆ సమయంలో కేవలం షెట్టరింగ్ దశలో ఉన్న ఈ ఇంటికి బుధవారం కాంక్రీట్ వేయగా, గురువారం సాయంత్రానికే డీషెట్టరింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ షియర్ వాల్ విధానంలో ఇటుకలు కాకుండా, ఇంటి గోడలన్నింటినీ స్టీల్, రీన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) తో ఒకేసారి నిర్మిస్తారు. దీనివల్ల గోడలు కేవలం విభజనల లాగా కాకుండా, మొత్తం ఇంటి బారాన్ని మోసే అత్యంత బలమైన మూలస్తంభాలుగా పనిచేస్తాయి. ఫలితంగా ఈ ఇళ్లకు ప్లాస్టరింగ్ వంటి పునరావృత పనుల అవసరం ఉండదు. అలాగే గోడలపై పగుళ్లు వచ్చే అవకాశం అస్సలుండదు.
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సహాయంతోనే, విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయాల మధ్య నాణ్యమైన ఇల్లు పూర్తి చేయడం లబ్ధిదారులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో షియర్ వాల్ టెక్నాలజీ అనేది తక్కువ లేబర్ ఖర్చుతో పటిష్టమైన ఇల్లు నిర్మించడానికి అద్భుతంగా దోహదపడుతోంది. పైగా ఈ నిర్మాణాలు భూకంపాలు, బలమైన గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడమే కాకుండా దాదాపు 60 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో ఈ సాంకేతికత ద్వారా లభించిన అద్భుతమైన ఫలితాలను చూసి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఈ ఆధునిక పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.






