ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

by Taduka Kalyani |   (  Updated:2026-07-21 13:47:16  IST  )

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఎస్ఐఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై మంగళవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాదు నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలక్ట్రోరల్ ఓటర్ జాబితాలో తప్పిదాలకు చోటు లేకుండా పారదర్శకంగా రూపొందించి అర్హులైన ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. మొదట ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్నుమరేషన్ పత్రాలను ప్రతి ఓటరుకు అందజేసినందున సకాలంలో పూరించి ఇచ్చేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీసీ అనంతరం వివిధ మండలాల తహసిల్దార్లు, ఇతర అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 79.75 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశారని, నిర్దేశిత గడువులోగా వంద శాతం పూర్తయ్యేలా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గద్వాల అర్బన్ లో 61 శాతం మాత్రమే డిజిటలైజేషన్ జరిగిందని, వార్డు అధికారులు, ఇతర వాలంటీర్ల సహకారం తీసుకొని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం ఉండాలన్నారు. వలస వెళ్లిన, మృతి చెందిన, రెండు ఓట్లు కలిగిన ఓటర్ల వివరాలను రీవెరిఫికేషన్ చేసి ఓటరు జాబితాను తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించాలన్నారు.

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

సీఎం, జిల్లా ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. విసి అనంతరం కలెక్టర్ అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రతి బుధవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ కు కృషి చేయాలన్నారు. భూభారతి, సాదా బైనామా, తదితర దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. రేషన్ దుకాణాలను తరచూ తనిఖీ చేస్తూ పిడిఎస్ బియ్యం పక్కదారి పెట్టకుండా నిఘా ఉంచాలన్నారు. తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం జారీ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, ఎన్నికల విభాగం అధికారి మంజుల, వివిధ మండలాల తహశీల్దార్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story