కోతులు, వీధికుక్కల సమస్యపై బీఆర్ఎస్ ధర్నా

by Ratna Kumari |

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో కోతులు, వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

కోతులు, వీధికుక్కల సమస్యపై బీఆర్ఎస్ ధర్నా
X

దిశ, చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో కోతులు, వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి మాట్లాడుతూ.. పట్టణంలోని కాలనీలు, ప్రధాన వీధుల్లో కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని, మరోవైపు వీధికుక్కల సంఖ్య విపరీతంగా పెరగడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

కోతులు, వీధికుక్కల దాడుల్లో ఇప్పటికే వందలాది మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పటికీ, మున్సిపల్ పాలకవర్గం సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించడం, వీధికుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. దాడులకు గురైన బాధితులకు ప్రభుత్వం ఉచిత వైద్య చికిత్సతో పాటు తగిన నష్టపరిహారం అందించాలని, కోతులు, వీధికుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపాలిటీ మేనేజర్‌కు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే షబానా అజీముద్దీన్, 9వ వార్డు ఇన్‌చార్జ్ ఆగు అశోక్ యాదవ్, మారగోని రమేష్, ఆవుల ఆనంద్ యాదవ్, బొలుగూరి సైదులు, జిట్టా శేఖర్, పోకల రమేష్, ఉప్పలపల్లి నగేష్, సాయి రెడ్డి ప్రతాపరెడ్డి, పోకల రాములు, కునూర్ శంకర్, పాల కిష్టయ్య, రామగిరి జనార్దన్ రావు, రుద్రారపు కృష్ణ, ఎస్‌కే మన్నను, చేపూరి శ్రీనివాస్, వల్ల మల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Next Story