- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hydra: హైడ్రా భారీ ఆపరేషన్.. 200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రకృతిని పరిరక్షిస్తూ చారిత్ర రాళ్ల గుట్టలతో పాటు.. ఆతి పురాతన రాతి గుహలు, వాటి మధ్యన ఉన్న చెట్టూ.. చేమను హైడ్రా కాపాడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రకృతిని పరిరక్షిస్తూ చారిత్ర రాళ్ల గుట్టలతో పాటు.. ఆతి పురాతన రాతి గుహలు, వాటి మధ్యన ఉన్న చెట్టూ.. చేమను హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ - ఖాజాగూడ సరిహద్దుల్లో శుక్రవారం 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇందులో 250 కోట్ల సంవత్సరాల చారిత్రక రాళ్ల గుట్టలు కూడా ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏకు కేటాయించిన 200ల ఎకరాలు కూడా ఉన్నాయి. చారిత్రక గుట్టలను కాపాడాలని కోరుతూ దశాబ్దాలుగా `సొసైటీ టూ సేవ్ రాక్స్` ప్రతినిధులు పోరాడుతున్నారు. హైకోర్టును కూడా వీరు ఆశ్రయించారు. ఈ మేరకు రాతి గుట్టలతో పాటు.. ప్రభుత్వ భూమిని కాపాడాలని 2019లో మున్సిపల్, రెవెన్యూ శాఖలకు హైకోర్టు ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడం జాప్యం కావడంతో కబ్జాలకు ఆస్కారం ఇచ్చినట్టయ్యింది. ఇదే విషయాన్ని `సొసైటీ టూ సేవ్ రాక్స్` ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు క్షేత్రస్థాయిలో గతంలోనే పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్రవారం ఫెన్సింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భూమి విలువ రూ. 30వేల కోట్లు వరకూ ఉంటుందని అంచనా.
వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు
సర్వే నంబరు 452/1 లో 174 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అలాగే 454/1 సర్వే నంబరులో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాలు కాగా.. ఇందులో 263.05 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ ఎండీఏకు కేటాయించింది. రెండు గ్రామాల మధ్య ఓవర్‌ల్యాప్ ఇష్యూలతో 63.05 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్ఎండీఏకు 200ల ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఇవే చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు కేటాయించగా.. దర్గాకు 5 ఎకరాలు అప్పజెప్పినట్టు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇలా ఎవరికి కేటాయించిన భూములు పోగా.. 200 ఎకరాల హెచ్ఎండీఏ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. `సొసైటీ టూ సేవ్ రాక్స్` ప్రతినిధులు కోరిన విధంగా అక్కడ చారిత్రక బండ రాళ్లను కూడా హైడ్రా కాపాడినట్టయ్యింది. మంచి వ్యూ పాయింట్‌తో.. ఎంతో ఎత్తుగా.. సహజ సిద్ధంగా ఉన్న గుట్టలను, 250 కోట్ల సంవత్సరాల చరిత్ర గల కొండలను కాపాడి ప్రకృతిని పరిరక్షించారంటూ రాక్ సొసైటీ ప్రతినిధులు హైడ్రాను కొనియాడారు. రాళ్ల గుట్టలతో పాటు పలు ఆలయాలున్న చారిత్రక స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కాపాడిన హైడ్రాకు ప్రజలతో పాటు భక్తులు, పర్యావరణ ప్రేమికులు అభినందనలు తెలిపారు. దశాబ్దాల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవను అభినందించారు. ఈ గుట్టలను ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఒక పక్క ఎత్తైన కొండ.. దిగువ భాగంలో ఉన్న భగీరథమ్మ చెరువు సిద్ధమైతే.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని పలువురు ఈ సందర్భంగా పేర్కొన్నారు.






