నెక్కొండ ఎస్‌ఐ సస్పెన్షన్..!

by Jakkula.Mamatha |

సివిల్ వివాదంలో అనధికారికంగా జోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో శాఖాపరంగా విచారణ చేపట్టిన అనంతరం వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు.

నెక్కొండ ఎస్‌ఐ సస్పెన్షన్..!
X

దిశ, నర్సంపేట: సివిల్ వివాదంలో అనధికారికంగా జోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో శాఖాపరంగా విచారణ చేపట్టిన అనంతరం వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఎస్‌ఐ మహేందర్ విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు చేయడం, గొర్లు కొనుగోళ్లకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ విషయంలో ఒక వైపు పక్షపాతం ప్రదర్శించినట్లు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ జరిగినట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో ఆరోపణలకు బలం ఉన్నట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, విధి నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ శ్వేత స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా నెక్కొండ ఎస్సై మహేందర్ మీద గతంలో పలు అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పలుమార్లు పిర్యాదులు చేశారు. నెక్కొండలో సివిల్ సప్లై అధికారులు సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం లారీ మాయం అయిన ఘటనలో ఎస్సై హస్తం ఉందని అప్పట్లో ప్రచారం జరగడం గమనార్హం.

Next Story