హైదరాబాద్‍కు తాకిన విద్యార్థుల ఆందోళన.. లోక్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

by Prasad Jukanti |   (  Updated:2026-07-21 13:40:14  IST  )

ఢిల్లీ లాఠీచార్జ్‌కు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళ హైదరాబాద్‍లో 'చలో లోక్ భవన్' కు పిలుపునిచ్చాయి.

హైదరాబాద్‍కు తాకిన విద్యార్థుల ఆందోళన.. లోక్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీచార్జ్ సెగ హైదరాబాద్‌కు తాకింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా, నీట్ అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‍‍ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ SFI, AISF, PDSU, AIFDS తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఛలో లోక్ భవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి లోక్‍భవన్ ముట్టడికి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. లోక్‍భవన్ వైపు దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని, రోడ్డుపై ఈడ్చిపారేశారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్‍లకు తరలించారు. అయితే పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను ఈడ్చుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.

పోలీసుల తీరును ఖండించిన విద్యార్థి సంఘాలు:

ఛలో లోక్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి లోక్‍భవన్ వైపు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేసి ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన విద్యార్థి సంఘాల నేతలు.. ఆందోళన సందర్భంగా విద్యార్థులను ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లోకి ఎక్కించడం, తోపులాటలో పలువురు విద్యార్థులు గాయపడడం దురదృష్టకరమన్నారు. విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ.. సోనం వాంగ్‍చుక్‍తో పాటు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కులు, విద్యా హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జి, దాడులు ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ధర్మేంద్ర ప్రదాన్‍ను బర్తరఫ్ చేయాలి:

నీట్ పేపర్ లీక్ సహా విద్యారంగంలో చోటుచేసుకున్న వివిధ సంక్షోభాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశ విద్యార్థుల, యువత రక్తం చూడటమేనా దేశభక్తి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యను కాపాడాలని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులపై ఇటువంటి నిర్బంధ చర్యలు బ్రిటీష్ పాలనను తలపిస్తున్నాయని విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జరిగిన అణచివేతను నేడు బీజేపీ ప్రభుత్వం పునరావృతం చేస్తోందని ద్వజమెత్తారు. విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం ద్వారా విద్యా సంక్షోభాన్ని దాచిపెట్టలేరని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story