రాహుల్ గాంధీ మాట మార్చడం తగదు: కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం

by Kema Shiva Kumar |

కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది.

రాహుల్ గాంధీ మాట మార్చడం తగదు: కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ తదితర అగ్రనేతలు చేపట్టిన ధర్నా ప్రదేశంలో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వంటి బాధ్యతాయుతమైన నాయకుడు ఇచ్చిన మాటను క్షణాల్లో మార్చడం దురదృష్టకరమని కేంద్రం పేర్కొంది.

చర్చలకు సిద్ధమని.. మాట మార్చిన రాహుల్

అయితే, ధర్నా ప్రదేశం నిరసనలకు కేటాయించిన స్థలం కాకపోవడం, సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతుండటంతో.. కాంగ్రెస్ అగ్రనేతల హోదాను గౌరవిస్తూ ప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందం, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌ (Govind Mohan)తో కలిసి నేరుగా ధర్నా స్థలానికి వెళ్లినట్లుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆందోళన విరమించాలని రాహుల్ గాంధీని కోరగా నీట్ (NEET) పరీక్ష అక్రమాలు, విద్యార్థుల ఉద్యమంపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం ఒప్పుకుంటే వెంటనే ధర్నా విరమిస్తానని ఆయన షరతు విధించారు. అందుకు దీనికి స్పందించిన ప్రతినిధి బృందం, ప్రభుత్వ పెద్దల అనుమతి తీసుకుని నీట్ వివాదంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే హామీని రాహుల్ గాంధీకి తక్షణమే తెలియజేసింది.

రాహుల్ వైఖరిపై తీవ్ర విమర్శలు..

అయితే, కేంద్ర నుంచి హామీ లభించిన మరుక్షణమే రాహుల్ గాంధీ తన మాట మార్చారని ప్రతినిధి బృందం వెల్లడించింది. కేవలం పార్లమెంట్‌లో చర్చ మాత్రమే కాకుండా, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలనే మరో కొత్త డిమాండ్‌ను ఆయన తెరపైకి తెచ్చారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం చర్చకు ఒప్పుకున్నాక, ఇలా మాట మార్చడం తగదని నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ‘నా డిమాండ్లు మార్చుకోవడం నా ఇష్టం’ అని రాహుల్ బదులిచ్చినట్లుగా తెలిపారు. నిరసనలకు ఇది సరైన స్థలం కాదని హోం కార్యదర్శి వివరించే ప్రయత్నం చేయగా.. ‘ఎక్కడ కూర్చోవాలో నిర్ణయించుకోవడం కూడా నా ఇష్టమే’ అంటూ ఆయన జవాబిచ్చినట్లుగా జితేంద్ర సింగ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

Next Story