మైనర్ బాలికపై లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి

by Taduka Kalyani |

ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మైనర్ బాలికపై లైంగిక దాడి.. ఆలస్యంగా వెలుగులోకి
X

దిశ, మిడ్జిల్: ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి పై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గత 6 నెలల నుండి మానసికంగా వేధిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. సంఘటనపై ఈ నెల 14 వ తేదీన అమ్మాయి కుటుంబ సభ్యులతో వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజుల అయిన పట్టించుకోవడంలేదని అమ్మాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గ్రామ పెద్దలు, నాయకులు అత్యాచార సంఘటనలో రాజీ కుదిరించేందుకు పోలీస్ స్టేషన్ లో పంచాయతీ పెట్టి పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. బాలికకు న్యాయం చేయాల్సిన ఎస్సై ఫిర్యాదు చేసిన ఎలాంటి దర్యాప్తు చేయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అమ్మాయికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

యువకుడిపై పోక్సో కేసు నమోదు..

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వినోద్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నేను సెలవులో ఉన్న కారణంగా కేసు విషయంలో ఆలస్యం అయిందని తెలిపారు. గ్రామ పెద్దలు, ఇరు కుటుంబ సభ్యులు కలిసి సమయం అడిగినట్లు సూచించారు.

Next Story