ఆయన మూడో కన్ను తెరిస్తే భస్మమే: మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన 'ఛలో పంచదార్ల' కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

ఆయన మూడో కన్ను తెరిస్తే భస్మమే: మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన 'ఛలో పంచదార్ల' కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, స్థానిక నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవిత్రమైన పంచదార్ల పుణ్యక్షేత్రంలో అక్రమ తవ్వకాల వల్ల నీటి రంగు కూడా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రమేశ్ అంటే.. "కరప్షన్ మ్యాన్ రమేశ్" అని అభివర్ణించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పవిత్ర క్షేత్రాల పవిత్రేతను దెబ్బతీస్తున్నారని, దేవుడు ఇదంతా చూస్తున్నాడని హెచ్చరించారు. "ఆ పరమశివుడు మూడో కేన్ను తెరిస్తే వీరంతా భస్మం కాక తప్పదు" అని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ ప్రాంతాన్ని 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

అమరావతి అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్..

రాజధాని నిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని అమర్నాథ్ ఆరోపించారు. అమరావతిని దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్‌గా మార్చేశారని. విమర్శించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావాలంటే 'రెడ్ బుక్ రాజ్యాంగం' అమలు చేయడం కాదని, పారిశ్రామికవేత్తలకు 'రెడ్ కార్పెట్' పరిస్తేనే పెట్టుబడులు వస్తాయని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని, పారిశ్రామిక అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఈ పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లు పెట్టుబడుల పేరుతో ప్రపంచ దేశాలు చుట్టి రావడం కేవలం కాలక్షేపానికే తప్ప, రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ప్రాజెక్టులను సాధించిన ప్రగతినే ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. పంచదార క్షేత్రాన్ని, పరిసర కొండలను అక్రమ తవ్వకాల నుంచి కాపాడుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఈ సందర్భంగా అమర్ నాథ్ స్పష్టం చేశారు.

Next Story