కేటీఆర్, కొప్పులపై మంత్రి అడ్లూరి ఫైర్..

by Kodari Anjali |

సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ధర్మారం మండలంలో పర్యటించారు.

కేటీఆర్, కొప్పులపై మంత్రి అడ్లూరి ఫైర్..
X

దిశ, ధర్మారం: ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పర్యటించారు. పైడిచింతలపల్లి, రచ్చపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించి, ఓటరు నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నంది మేడారం గ్రామంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి నూతనంగా నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గ్రామంలో నిర్మించిన రెండు అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొండగట్టు రోడ్డు ప్రమాదంలో బాధితులను పరామర్శించని కేటీఆర్, ఇప్పుడు లక్షేటిపేట ప్రమాద బాధితుల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇక్కడి నీటిని సిద్ధిపేట ప్రాంతానికి..

బీఆర్ఎస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడూ పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు రైతు సదస్సుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్షాభావంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నంది రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందడం లేదని, ఇక్కడి నీటిని సిద్ధిపేట ప్రాంతానికి మళ్లిస్తున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పర్యటనలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంజిత్, సర్పంచులు రాజయ్య, వీర్‌పాల్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story