- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాడ కోసం జగిలాలతో వేట
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు, జాగిలాల సాయంతో చెరువు పరిసరాలు, అటవీ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ వివరాలను విశ్లేషిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన రాత్రి బాధితుల ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా నిందితుడి కదలికలను పరిశీలిస్తున్నారు. మైనర్ బాలికను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. అనంతరం చెరువు సమీపంలో బాలిక మృతదేహం లభించడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
గతంలోనూ కేసులు.. వివాదాస్పద చరిత్ర..
రాజ్‌కుమార్‌పై గతంలో భూ వివాదాలకు సంబంధించి కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఓ భూమి వ్యవహారంలో పలువురిని బెదిరించిన కేసుతో పాటు మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అతడికి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలవాట్లు ఉన్నాయనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో రెండు, మూడు సార్లు కౌన్సెలింగ్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.
షాబాద్‌లో ఉద్రిక్తత.. ట్రాఫిక్ మళ్లింపు..
ఘటనపై ఆగ్రహంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దీంతో షాద్‌నగర్–చేవెళ్ల (బెంగళూరు–ముంబై లింక్ హైవే) రహదారిపై ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. వాహనాలను శంషాబాద్, నాగర్‌గూడ మార్గాల మీదుగా పోలీసులు మళ్లించారు. పలుచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
అద్దె కారుపై విచారణ..
నిందితుడు షాద్‌నగర్‌కు సెల్ఫ్ డ్రైవ్ అద్దె కారులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వాహన యజమానిని విచారించడంతో పాటు ఆ కారు ప్రయాణ వివరాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
కఠిన శిక్ష విధించాలని డిమాండ్..
ఈ ఘటనను రాజ్‌కుమార్ తల్లిదండ్రులు, భార్య కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఖండించారు. నిర్దోషుల ప్రాణాలు తీసిన రాజ్‌కుమార్‌కు అత్యంత కఠిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.






