- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. ‘సుప్రీం’కు చేరిన వివాదం
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.. నిందితుడి విచారణపై హైకోర్టు ఇచ్చిన నిబంధనలపై స్టే ఇవ్వాలని పిటిషన్!

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) వ్యవహారం సుప్రీంకోర్టు చేరింది. ఈ కేసుపై హైకోర్టు విధించిన నిబంధనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ కృష్ణలంక సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజు విచారణపై రాష్ట్ర హైకోర్టు విధించిన కఠిన నిబంధనలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని (Supreme Court) ఆశ్రయించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) నిందితుడిని ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతించినప్పటికీ.. ఆ విచారణను కేవలం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే నిర్వహించాలని, ఘటనా స్థల పరిశీలన మినహా బయటకు తీసుకురాకూడదని, ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని కఠిన షరతులు విధించింది. ఈ ఆదేశాలపై తక్షణమే స్టే విధించాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు విధించిన ఈ కఠినమైన పరిమితులు కేసు దర్యాప్తు పురోగతి పై తీవ్ర ప్రభావం చూపుతాయని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. సాయికృష్ణ మృతదేహం లభ్యత, అదృశ్యమైన పోలీస్ స్టేషన్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌ల రికవరీ వంటి అత్యంత కీలకమైన అంశాలలో నిందితుడిని కేవలం జైలు పరిధిలోనే ప్రశ్నిస్తే ఆశించిన ఫలితాలు రావని, సాక్ష్యాల సేకరణ కష్టతరమవుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. నిందితుడి ప్రాథమిక హక్కులను కాపాడుతూనే, దర్యాప్తు సంస్థకు పూర్తిస్థాయిలో ప్రశ్నించే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకే హైకోర్టు విధించిన షరతులను సడలించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.






