హార్మూజ్ ఆపరేషన్ షురూ!

by Muthe.Rajitha |   (  Updated:2026-03-20 05:41:19  IST  )

హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా భారీ సైనిక ఆపరేషన్ మొదలు పెట్టినట్టు సమాచారం.

హార్మూజ్ ఆపరేషన్ షురూ!
X

దిశ, వెబ్ డెస్క్ : హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా భారీ సైనిక ఆపరేషన్ మొదలు పెట్టినట్టు సమాచారం. ప్రపంచ చమురు సరఫరాకు గేట్ వే వంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేయడంతో, దానిని తిరిగి తెరిపించేందుకు అమెరికా దాడులు మొదలు పెట్టింది. ఈ ఆపరేషన్ కోసం అమెరికా కేవలం నావికా దళాన్నే కాకుండా, తీర ప్రాంతంలో ఇరాన్ మోహరించిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, వేగంగా దూసుకొచ్చే అటాక్ బోట్లను సమర్థవంతంగా ఎదుర్కోగల గగనతల శక్తిని రంగంలోకి దించింది. అమెరికా ఛైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్‌లో తక్కువ ఎత్తులో ప్రయాణించే అపాచీ అటాక్ హెలికాప్టర్లు, శక్తివంతమైన యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. ఇరాన్ ఈ జలసంధిలో అడ్డుగా నిలిపిన సీమైన్స్, బోట్స్‌, మిసైల్స్‌ లను క్లియర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా 119 డాలర్లకు చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది.

A-10 యుద్ధ విమానాలు.. అపాచీ హెలికాఫ్టర్లు

ఈ యుద్ధ వ్యూహంలో భాగంగా అమెరికా తన అమ్ములపొదిలోని A-10 (ఏ-10) యుద్ధ విమానాలను అత్యంత వ్యూహాత్మకంగా వాడుతోంది. వాస్తవానికి ఈ విమానాలను పదాతి దళాలకు 'క్లోజ్ ఎయిర్ సపోర్ట్' అందించడానికి రూపొందించినప్పటికీ, ప్రస్తుతం వీటిని ఇరాన్ యొక్క ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లను, నౌకలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తున్నారు. జోర్డాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ విమానాల ముక్కు భాగంలో 30 MM గన్ ఉండటమే కాకుండా, రెక్కలపై భారీ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. వీటికి అండగా అపాచీ హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రు లక్ష్యాలను మట్టుబెడుతున్నాయని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు.

రహస్య మిత్ర దేశాల సహాయం!

అయితే ఈ పోరాటంలో అమెరికాకు కొన్ని రహస్య మిత్రదేశాలు కూడా తమ అటాక్ డ్రోన్లతో అమెరికాకు సహకరిస్తున్నాయి. ఈ మిత్రదేశాల అపాచీ హెలికాప్టర్లు కూడా డ్రోన్ దాడులను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జనరల్ డాన్ కెయిన్ ధృవీకరించారు. ఇరాన్ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక ద్వీపాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా హార్మూజ్ జలసంధిపై శాశ్వత పట్టు సాధించాలన్నదే అమెరికా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ద్వీపాల స్వాధీనం పూర్తయితేనే చమురు ట్యాంకర్ల రాకపోకలకు పూర్తి భద్రత లభిస్తుందని సైనికాధికారులు భావిస్తున్నారు.

ముదురుతున్న యుద్ధం.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మల్టీ వార్‌హెడ్ మిస్సైల్స్ ప్రయోగం

Next Story