- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాలు.. ఎవరినీ వదలమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక
ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారన్నారు. దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలెట్ ప్రాజెక్టు కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినట్లు తెలిపారు. అనేక అవినీతి, అక్రమాలు గుర్తించామన్నారు. ప్రాధమిక నివేదికలో స్పష్టమైందన్నారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడిన ఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నత స్ధాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. విచారణలో ఎదురైన అంశాలు, ఎవరి పాత్ర ఎంత? తెర వెనుక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ప్రాధమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించారు.
4,848 లావాదేవీల్లో అక్రమాలు
ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35 వేల లావాదేవీలు జరిగాయని, ఇందులో ప్రాధమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఐతే విచారణ తర్వాత 1109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు రూ.4 కోట్లు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందు చూపు లేకుండా ఒక కుట్ర పూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంత మంది అక్రమాలకు పాల్పడితే భూ భారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వాస్తవ పరిస్దితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు రూ.1000 కోట్ల అవినీతి అని, మరో నాయకుడు రూ.10 వేల కోట్లు అని, ఇంకొక్కరు భూ భారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.
నేడు ఖమ్మంలో లైసెన్స్‌ల అందజేత
ఇప్పటికే మొదటి విడతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేశామని, ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో మరో రెండు వేల మందికి లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ విజయ్‌కుమార్, ఉన్నత స్ధాయి కమిటీ సభ్యులు డీఐజీ ఎం.సుభాషిని, సీఎమ్మార్వోఆ ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్, ఏసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎ.సంపత్, ఎన్ఐసీ ప్రతినిధి శ్రీనివాస్, హోంశాఖ సలహాదారు పి.శరత్ కుమార్ పాల్గొన్నారు.
READ MORE .....
కేటీఆర్‌వి మతిలేని మాటలు: పొంగులేటి సీరియస్
చిరంజీవి, నా కొడుకు అందుకే దావోస్ వచ్చారు.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు






