ఫ్రెంచ్ ఓపెన్ ను భయపెడుతున్న ఎండలు

by Muthe.Rajitha |   (  Updated:2026-05-30 04:36:23  IST  )

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌ను తీవ్రమైన ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి.

ఫ్రెంచ్ ఓపెన్ ను భయపెడుతున్న ఎండలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌ను తీవ్రమైన ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 33 నుండి 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో.. ఈ తీవ్రమైన ఎండల ప్రభావం టెన్నిస్ కోర్టులో అప్సెట్లకు దారితీసింది. సాధారణంగా చల్లటి వాతావరణంలో సాగే రోలాండ్ గారోస్ క్లే కోర్టుల సమరం, ఈసారి ఆఫ్రికా ఖండం నుండి వీస్తున్న తీవ్రమైన వేడి గాలుల కారణంగా ఆటగాళ్లను తీవ్రమైన డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి ముప్పుల్లోకి నెట్టేసింది. తీవ్ర ఎండల కారణంగా ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, టోర్నమెంట్ ఫేవరెట్ జానిక్ సిన్నర్ అర్జెంటీనా ఆటగాడు జువాన్ మాన్యుయెల్ సెరుండోలో చేతిలో ఊహించని విధంగా ఓటమి పాలుకావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. మ్యాచ్‌లో రెండు సెట్లు గెలిచి, మూడో సెట్‌లో 5-1తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న సిన్నర్, ఒక్కసారిగా తీవ్రమైన ఎండ కారణంగా తీవ్ర డీహైడ్రేషన్ తో ఇబ్బంది పడ్డాడు. కోర్టులోనే వైద్య సహాయం తీసుకున్నప్పటికీ కోలుకోలేక ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు, 20 ఏళ్ల యువ సంచలనం జకుబ్ మెన్‌సిక్ దాదాపు 4 గంటల 41 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంలో మరియానో నవోన్‌పై విజయం సాధించిన వెంటనే కోర్టులోనే కుప్పకూలిపోయాడు. కదల్లేని స్థితికి చేరుకున్న అతనికి ఐస్ ప్యాక్‌లతో ప్రాథమిక చికిత్స అందించి, వీల్ చైర్ సహాయంతో కోర్టు వెలుపలికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అనంతరం మెన్‌సిక్ మాట్లాడుతూ.. ఈ తరహా ప్రాణాంతక వాతావరణంలో మ్యాచ్‌లు ఆడించడం పూర్తిగా పిచ్చితనం అంటూ నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

టోర్నమెంట్ నిలిపివేత!

ఈ వాతావరణ మార్పులు కేవలం ఆటగాళ్ల ఆరోగ్యాన్నే కాకుండా, టెన్నిస్ ఆట శైలిని కూడా పూర్తిగా మార్చివేశాయి. ఎండ తీవ్రతకు క్లే కోర్టులు ఎండిపోయి గట్టిపడకుండా ఉండేందుకు ప్రతి సెట్ ముగిసిన తర్వాత సిబ్బంది నీళ్లు మరియు ఉప్పును చల్లుతూ కోర్టులను తడపాల్సి వస్తోంది. అయితే, ఈ వేడి కారణంగా కోర్టు ఉపరితలం పొడిగా మారి బంతి గాలిలో అత్యంత వేగంగా దూసుకెళ్లడంతో పాటు, ఊహించని విధంగా ఎక్కువ బౌన్స్ అవుతోంది. ఇది సాధారణంగా నెమ్మదిగా సాగే క్లే కోర్టుల సహజ సిద్ధమైన శైలిని మార్చి, హార్డ్ కోర్టులను తలపించేలా చేస్తోంది. ఈ మార్పు పవర్‌ఫుల్ సర్వీసులు, అగ్రెసివ్ షాట్లు ఆడే అమెరికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కలిసి వస్తుండగా, సాంప్రదాయ క్లే కోర్టు ఆటగాళ్లకు కష్టంగా మారింది. ఈ వాతావరణ పరిస్థితులపై స్పందించిన లెజెండరీ ఆటగాడు నోవాక్ జకోవిచ్.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అత్యంత వేడిగా ఉండే మధ్యాహ్న సమయాల్లో కాకుండా, మ్యాచ్‌లను సాయంత్రం లేదా లేట్ నైట్ సెషన్స్‌కు రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం టోర్నమెంట్ నిర్వాహకులు వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్ (WBGT) నిబంధనల ప్రకారం కూలింగ్ బ్రేకులు ఇస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఎండలు ఇలాగే కొనసాగితే మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.

French Open 2026 : జకోకు షాక్.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆశలు గల్లంతు

Next Story