French Open 2026 : జకోకు షాక్.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆశలు గల్లంతు

by Harish |

French Open 2026 : జకోకు షాక్.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆశలు గల్లంతు
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో పెను సంచలనం నమోదైంది. గురువారం సిన్నర్ నిష్ర్కమించగా.. మరో టైటిల్ ఫేవరెట్ నోవాక్ జకోవిచ్ కూడా ఇంటిదారిపట్టాడు. మూడో రౌండ్‌లోనే అతని ఆట ముగిసింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్‌కు బ్రెజిల్ ప్లేయర్ ఫోన్సెకా షాకిచ్చాడు. ఐదు సెట్లపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫోన్సెకా 4-6, 4-6, 6-3, 7-5, 7-5 తేడాతో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు నెగ్గిన జకోనే విజయానికి చేరువయ్యాడు. కానీ, అద్భుతంగా పుంజుకున్న ఫోన్సెకా జకో ఆశలపై నీళ్లు చల్లాడు. అతను వరుసగా 3, 4, 5 సెట్లు నెగ్గడంతో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలన్న జకో ఆశలు గల్లంతయ్యాయి.

ప్రీక్వార్టర్స్‌కు స్వైటెక్

ఉమెన్స్ సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ హవా కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మూడో రౌండ్‌లో స్వైటెక్ 6-4, 6-4 తేడాతో పొలాండ్‌కే చెందిన లినెట్టెపై విజయం సాధించింది. గంటా 25 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి ఆమెకు కాస్త పోటీ ఎదుర్కొంది. కానీ, స్వైటెక్ అనుభవం ముందు లినెట్టె నిలువలేకపోయింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి స్విటోలినా, రష్యాకు చెందిన మిర్రా ఆండ్రీవా కూడా నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు.


Next Story