- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తోంది: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు తొలుత అనుమతి నిరాకరించినప్పటికీ.. హైకోర్టు జోక్యంతో సభ నిర్వహణకు అనుమతి లభించిందని తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు తొలుత అనుమతి నిరాకరించినప్పటికీ.. హైకోర్టు జోక్యంతో సభ నిర్వహణకు అనుమతి లభించిందని తెలిపారు. అయినప్పటికీ.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను సభకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా నాయకులను నిర్బంధించడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయస్థానాల పట్ల గౌరవానికి విరుద్ధమని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే వాటి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని.. ఆ హక్కును పోలీసులు అణిచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని తెలిపారు. యువత సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. యువత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఇటువంటి నిరంకుశ ధోరణిని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ నాయకులను నిర్బంధించిన ఘటనపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.






