స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు.. రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు!

by Ramesh Naini |

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచింది.

స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు.. రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచింది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పరిమితిని గ్రూపునకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతూ.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయల రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సంఘాలు రూ.10 లక్షల వరకు తీసుకునే రుణాలపై పూర్తి వడ్డీ సబ్సిడీని ప్రభుత్వం భరించనుంది. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు విధించే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ లేని రుణాల కింద భరిస్తుంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకుల లెండింగ్ పాలసీ ప్రకారం విధించే వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లించనుంది.

క్యాష్ క్రెడిట్ రుణాలు పొందిన సంఘాలు ప్రతి నెల కనీసం 3 శాతం అసలు మొత్తాన్ని గడువు తేదీ నుంచి 7 రోజుల్లోగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టర్మ్ లోన్లు తీసుకున్న వారు 30 రోజుల్లోగా నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లించని సంఘాలు ఆ నెలకు వడ్డీ సబ్సిడీని కోల్పోతాయి. ఈ పథకం కింద అర్హులైన మహిళా సంఘాల ఖాతాల్లోకి ప్రతి మూడు నెలలకోసారి నేరుగా వడ్డీ డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. దీంతోపాటు మహిళా సంఘాలు చేపట్టే సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, క్యాంటీన్లు వంటి ప్రత్యేక పథకాలకు కూడా ఈ వడ్డీ సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story