Google: $400 బిలియన్ డాలర్ల ఆదాయంతో గూగుల్ సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన సుందర్ పిచాయ్ టీమ్!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-05 09:51:39  IST  )

Google: $400 బిలియన్ డాలర్ల ఆదాయంతో గూగుల్ సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన సుందర్ పిచాయ్ టీమ్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (google) భారీ ఆదాయంతో సరికొత్త రికార్డు సృష్టించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కళ్ళు చెదిరే ఫలితాలను ప్రకటించింది. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వార్షిక ఆదాయం $400 బిలియన్ల (దాదాపు ₹33 లక్షల కోట్లు) మార్కును అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (CEO Sundar Pichai) ఎక్స్ వేదికగా పూర్తి గణాంకాలతో ఆసక్తికరమైన పోస్టును పెట్టారు. అందులో ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం గూగుల్ ప్రవేశపెట్టిన సరికొత్త AI మోడల్ 'Gemini 3' అని సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. కంపెనీ చరిత్రలో మరే మోడల్‌కు లేనంత వేగంగా జెమిని 3ని వినియోగదారులు ఆదరిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

జెమిని యాప్ దూకుడు

ఏఐ ప్రపంచానికి పోటీగా గూగుల్ తీసుకొచ్చిన జెమిని యాప్‌ను నెలకు 750 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉపయోగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో గూగుల్ క్లౌడ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 48% పెరిగి, ఏడాదికి $70 బిలియన్ల రన్-రేట్‌కు చేరుకుంది. అలాగే యూట్యూబ్ యాడ్స్, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా 2025లో $60 బిలియన్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గూగుల్ సెర్చ్ విభాగం ఆదాయంలో 17% వృద్ధి నమోదు చేసింది. గూగుల్ వన్, యూట్యూబ్ ప్రీమియం వంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య 325 మిలియన్లు దాటడటంతో భారీగా ఆదాయం సమకూరింది. డైరెక్ట్ API వినియోగం ద్వారా నిమిషానికి 10 బిలియన్లకు పైగా టోకెన్లను జెమిని ప్రాసెస్ చేస్తోంది.

2026 ఆర్థిక సంవత్సరంపై సుందర్ పిచాయ్ ధీమా

2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గూగుల్ కళ్ళు చెదిరే ఫలితాలను సాధించడంతో పాటు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. దీంతో 2026 ఆర్థిక సంవత్సరంపై సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. "మా పూర్తి స్థాయి AI స్టాక్ మా పురోగతికి ఇంధనంగా పనిచేస్తోంది. 2026లోకి మేము మరింత ఉత్సాహంగా, బలమైన స్థితిలో అడుగుపెడుతున్నాము. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూడబోతున్నారు" అని సుందర్ పిచాయ్ తన ప్రకటనలో తెలిపారు. దీంతో కేవలం సెర్చ్ ఇంజిన్‌గానే కాకుండా, AI, క్లౌడ్ రంగాల్లో కూడా గూగుల్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

వికసిత్ భారత్ దిశగా మరో అడుగు.. అమెరికాతో 500 బిలియన్ డాలర్ల వ్యాపార ఒప్పందం

Next Story