మహిళా బిల్లుపై గౌరవ్ గగోయ్ సంచలన వ్యాఖ్యలు.. డీలిమిటేషన్ లింక్‌పై అభ్యంతరం.

by Malleboina Mahesh |   (  Updated:2026-04-16 09:13:07  IST  )

మహిళా బిల్లుపై గౌరవ్ గగోయ్ ఫైర్! డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడంపై ఆగ్రహం. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని విమర్శ.

మహిళా బిల్లుపై గౌరవ్ గగోయ్ సంచలన వ్యాఖ్యలు.. డీలిమిటేషన్ లింక్‌పై అభ్యంతరం.
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గగోయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెడుతున్నారని ఆయన విమర్శించారు. లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "మహిళా రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ఈ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని మాత్రమే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మహిళలకు నిజంగా అధికారం ఇవ్వాలని ఉంటే, ఈ నిబంధన ఎందుకు?" అని గగోయ్ ప్రశ్నించారు.

మహిళా బిల్లు సభలోకి రావడం ఇది మొదటిసారి కాదని, గతంలోనూ యూపీఏ ప్రభుత్వం దీని కోసం ప్రయత్నించిందని ఆయన గుర్తు చేశారు. అప్పుడు కూడా ఇలాగే సాకులు చెప్పి కాలయాపన చేశారని, ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే బాటలో నడుస్తోందని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం జనగణన (Census) తర్వాతే డీలిమిటేషన్ జరుగుతుందని చెప్పిందని, కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు దీనిని లింక్ పెట్టి గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. మహిళలకు వెంటనే రిజర్వేషన్లు ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని, అందుకే ఇన్ని మెలికలు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కుట్రపూరిత చర్య

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను మార్చడం ద్వారా కొన్ని రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని గగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో వాటా కల్పించకుండా బిల్లును తీసుకురావడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిజంగా నారీ శక్తిపై గౌరవం ఉంటే, ఎటువంటి షరతులు లేకుండా వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

భారత్ - ఆస్ట్రియా మైత్రిలో నూతన అధ్యాయం.. ప్రధాని మోడీ, ఛాన్సలర్ స్టాకర్ కీలక ఒప్పందాలు

డీలిమిటేషన్‌పై రేవంత్ ప్రతిపాదన ‘ఫూలిష్’.. తేజస్వీ సూర్య సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు.. కేంద్రం క్లారిటీ

Next Story