హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం.. ఏడాదిలో కాలంలో భారీగా కేసులు

by Prasad Jukanti |   (  Updated:2026-07-19 11:33:14  IST  )

హైదరాబాద్ నగరంలో ఏడాదిలో 563 డ్రగ్స్ కేసులు నమోదు చేసి, రూ. 22.17 కోట్ల విలువైన మత్తుపదార్థాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం.. ఏడాదిలో కాలంలో భారీగా కేసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో నిషేధిత డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడమే లక్ష్యంగా సిటీ పోలీస్ విభాగం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా.. సరఫరాదారుల నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం, క్షేత్రస్థాయి నిఘా పెంచడం, వినియోగదారుల్లో మార్పు తీసుకురావడం లక్ష్యంగా లా అండ్ ఆర్డర్, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటి ఫలితంగా జూన్ 2025 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 563 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు కాగా ఈ దాడుల ద్వారా ఏకంగా రూ. 22.17 కోట్ల విలువైన నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుని ముఠాల గుట్టును రట్టు చేనట్లు సిటీ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆ జోన్‍లో భారీగా కేసులు:

జూన్ 2025 నుంచి జూన్ 2026 వరకు కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 563 ఎన్‌డీపీఎస్ (NDPS) కేసులు నమోదయ్యాయని వీటిలో జూబ్లీహిల్స్ జోన్ లో అత్యధికంగా 116 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ జోన్‍లో 99 కేసులు, గోల్కొండ జోన్‍లో 95, చార్మినార్ జోన్‍లో 90, రాజేంద్రనగర్ జోన్‍లో 84, ఖైరతాబాద్ జోన్‍లో 49, శంషాబాద్ జోన్‍లో 30 కేసులు నమోదైనట్లు తెలిపారు.

గంజాయిదే అగ్రస్థానం:

పోలీసులు జరిపిన దాడుల్లో రూ. 22.17 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడగా, అందులో అత్యధికంగా గంజాయే ఉంది. పోలీసులు సీజ్ చేసిన మత్తుపదార్థాల్లో గంజాయి 2,513 కిలోలు (విలువ రూ. 12.56 కోట్లు), హ్యాష్ ఆయిల్ 55.3 లీటర్లు (విలువ రూ. 6.91 కోట్లు), ఎండీఎంఏ (MDMA) 1626 గ్రాములు (విలువ రూ. 1.62 కోట్లు), కొకైన్ 129 గ్రాములు (విలువ రూ. 64.50 లక్షలు), హెరాయిన్ 120 గ్రాములు (విలువ రూ. 24 లక్షలు), ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు 570 (విలువ రూ. 17.10 లక్షలు), ఓపీయం 220 గ్రాములు (విలువ రూ. 1.25 లక్షలు) ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆపరేషన్ థండర్‌బోల్ట్'తో ఆకస్మిక తనిఖీలు:

స్థానిక డ్రగ్స్ స్థావరాల నిర్మూలన కోసం ఇటీవల హబీబ్‌నగర్ పరిధిలోని మంగార్ బస్తీలో 1,100 మంది సిబ్బందితో ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరిట భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్సీబీ, డీఆర్ఐ, ఈగల్ వంటి సంస్థల సహకారంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు నగరంలో మొత్తం 1550 మందికి ఈ పరీక్షలు నిర్వహించగా, వారిలో 421 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇలా పట్టుబడిన బాధితులను కేవలం శిక్షలకే పరిమితం చేయకుండా ఒక మానవీయ కోణంలో పోలీసులు వ్యవహరిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే విషయంలో పోలీస్ శాఖ అత్యంత సీరియస్‌గా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ భూతంపై రాజీలేని పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, నిందితులు ఎంతటి వారైనా, ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లల కదలికలు, వారి అలవాట్లు, ప్రవర్తనపై నిరంతరం గట్టి నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

Next Story