సామాజిక అధ్యయనంలో మా తొలి అడుగు

by Muthe.Rajitha |

జులై 12 ఆదివారం నుండి జులై 16 గురువారం వరకు మా ‘మహారాష్ట్ర దర్శన్’ యాత్ర కొనసాగింది.

సామాజిక అధ్యయనంలో మా తొలి అడుగు
X

జులై 12 ఆదివారం నుండి జులై 16 గురువారం వరకు మా ‘మహారాష్ట్ర దర్శన్’ యాత్ర కొనసాగింది. ఇందులో మేం 33 మంది పురుషులం, 20 మంది మహిళలు పాల్గొన్నాం. వీరిలో 11 మంది వివిధ స్థాయి ఆదివాసీ, ఆదివాసేతర మాజీ ఉద్యమ నాయకత్వ కామ్రేడ్స్ వున్నారు. మిగితావాళ్లలో ఏసీ (ఏరియా కమిటీ) స్థాయి వాళ్లే అధికం. మా కోరికపై మహారాష్ట్ర పోలీసులు ఈ యాత్రకు ప్లాన్ చేశారు.

మేం దర్శించిన వాటిలో హల్దీరాం వంటి పరిశ్రమలు, దీక్షాభూమి లాంటి ధార్మిక స్థలాలు, గజానన్ మహారాజు సమాధి మందిరం లాంటి ఆధ్యాత్మిక కేంద్రం, అజంతా, ఎల్లోరా లాంటి ప్రాచీన భారతీయ శిల్పకళా, వాస్తుశిల్ప అద్భుతాలు, లూనార్ సరస్సు లాంటి భూ వైజ్ఞానిక వారసత్వ ప్రదేశాలు, దౌలతాబాద్ కోట లాంటి దుర్భేధ్యమైన కోటలు వున్నాయి. వీటిలో హైటెక్ సిటీలు, శాసనసభలు లాంటివి మాత్రం లేవు. మా యాత్ర ఐదు రోజులు ఎక్కడా ఏ సమస్యా తలెత్తకుండా సాగింది. పోలీసులు రూపొందించిన ప్లాన్ ప్రకారం మా యాత్ర జయప్రదమైంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు.

‘బాహ్య ప్రపంచం’ తెలీనివారికి కొత్త ప్రపంచం

మేం యాత్ర చేస్తామని ప్రతిపాదించడం వెనుక మా ప్రధాన ఉద్దేశ్యం.. 2025 అక్టోబర్ 15 నాడు గడ్‌చిరోలీలో ఆయుధాలు వదిలిన 61 మందిలో ఆరుగురికి మినహా మిగతా ఎవరికీ ‘బాహ్య ప్రపంచం’తో పెద్దగా సంబంధం లేదు. వారిలో సగానికి పైగా సభ్యులు పీ.ఎల్.జీ.ఏ.లో చేరేనాటికి 20 యేళ్ల లోపు యువత. ఆ యువతలో మహిళలే అధికం. అవివాహితులు సగానికి పైగా వుంటారు. వారికి తమ ఊరు, పరిసర గ్రామాలు తప్ప ఇతర సమీప పట్టణాలతో కూడ పెద్దగా పరిచయం లేదనే విషయం తెలుసుకోవచ్చు. ఆయుధాలు వదిలి బయటకు వచ్చిన వారిలో పది మందికి మించి ఎవరికీ ఆధార్ కార్డులు కూడ లేవు. కారణాలు ప్రస్తుతం అప్రస్తుతం.

మహారాష్ట్రను దర్శించే అవకాశం

సాయుధ పోరాట తాత్కాలిక విరమణ చేసిన వారు అనేక రాష్ట్రాలలో వున్నారు. వారికి ఎక్కడికక్కడే ప్రభుత్వాలు ప్రధానంగా తమ ప్రయోజనాల కోసం, అలాగే అక్కడక్కడ మా కామ్రేడ్స్ కోరికపై కూడా పోలీసులు వివిధ ప్రాంతాలకు వారిని తీసుకెళ్లి చూపుతున్న నేపథ్యంలో మేం కూడ వివిధ ప్రాంతాలు వెళ్లి చూడాలనీ భావించాం. అందులో భాగంగా గడ్‌చిరోలీలో దాదాపు గత రెండు దశాబ్దాలుగా విద్యార్థుల కోసం కొనసాగుతున్న మహారాష్ట్ర దర్శన్ కార్యక్రమాన్ని మాకు అన్వయించి మాకు మహారాష్ట్ర దర్శించే అవకాశాన్ని కల్పించాలనీ అధికారులను కోరాం. ఈ యాత్ర పూర్తిగా మా కోరికపై జరిగిందే. దీనికి ముందు మాకు బల్లార్ పుర్ సమీపంలోని బొటానికల్ గార్డెన్ కూడ పోలీసులు చూపారు.

మార్పులను అర్థం చేయించడంలో సమస్య...

విప్లవోద్యమంలో పని చేస్తున్న కాలంలో ఏ మేరకు విప్లవ రాజకీయాలు చెప్పినప్పటికీ, బయట త్వరితగతిన మారుతున్న సామాజిక పరిస్థితుల గురించి తెలిసిన మేరకైనా పార్టీ ఉపాధ్యాయులు వారికి వివరించడం చాలా సమస్యగానే వుండేది. వారికి కనీస చదువు-సంధ్యలు లేకపోవడం, బాహ్య ప్రపంచంతో అనుబంధం లేకపోవడంతో వారు విప్లవ రాజకీయాలతో పాటు మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

ఆదివాసీ కామ్రేడ్స్‌ని ఎదిగించడంలో ఫెయిల్

వారు ఎంత అంకితభావంతో ఉద్యమంలో పని చేస్తున్నప్పటికీ, వారికి విప్లవోద్యమాన్ని అర్థం చేసుకోవడానికి కనీస స్థాయిలోనైనా ‘లోకజ్ఞానాన్ని’ అందించడం పార్టీ ముందు ఒక పెద్ద సవాల్ గానే వుండింది. వారు సైనిక చర్యలలో ఎంత అనుభవం గడిస్తున్నప్పటికీ, ప్రజలను సమీకరించడంలో, వారికి విప్లవ రాజకీయాలు బోధించడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో అనేక సమస్యలు ఎదుర్కొనేవారు. చదువుకున్న విద్యార్థి యువకులను, ఉద్యోగులను, మేధావులను, కవులను, కళాకారులను సమీకరించడం వారికి ఒక సవాల్ గానే వుండేది. ఆయా రంగాల వారి సమస్యలు తెలియకుండా వారిని ఎవరినీ సమీకరించలేమనే విషయం తెలిసిందే. అలాగే, ప్రభుత్వ చట్టాలను తెలుసుకోకుండా వాటితో వ్యవహరించలేమనే వాస్తవం విప్లవోద్యమంలో అడుగడుగునా ఎదురయ్యేది. ఈ సమస్యను అనేక సందర్భాలలో పార్టీ నాయకత్వం పేర్కొన్నప్పటికీ ఆశించిన మార్పులను తేలేకపోయాం. అది మా వైఫల్యం.

మార్పులను కళ్లారా తిలకించిన కామ్రేడ్స్

పై పరిస్థితుల నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని వదిలి బయటకు వచ్చిన వారికి కనీసంగానైనా ఈ బయటి పరిస్థితులను పరిచయం చేయడం జరూరైన విషయంగా భావించాను. ఆ సందర్భంగా నేను వారి వెంట వుండడం చాలా అవసరంగా కూడ భావించాను. త్వరలో వారంతా తమ తమ ఇళ్ళకు వెళ్లనున్న పరిస్థితులలో, తిరిగి అందరం కలిసి బయటి ప్రపంచాన్ని చూడడం కుదరక పోవచ్చు అనే అవగాహనతో కలసి ఉన్నపుడే అంతా కలిసి వెళ్ళాం. ఈ విషయాన్ని పరిశీలించిన పోలీసులు మా కోరికను ఆమోదించి గడ్‌చిరోలీ పునరావాస కేంద్రంలో వున్న 110 మందిని రెండు బ్యాచులుగా మహరాష్ట్ర దర్శన్‌కు పంపడానికి ప్లాన్ చేశారు. మూడు బస్సులు, ఒక తిండి పదార్థాల వ్యాను, తగిన భద్రతా బలగాలు, ఇతర సిబ్బందితో చేసిన ఐదు రోజుల పర్యటన సంతృప్తికరంగా సాగింది. 53 మంది సమావేశమై పర్యటనను సమీక్షించుకున్నాం. వారు చూసిన ప్రతి చోటు వారి మనసులలో ముద్రపడింది. ఆశ్చర్యానందాలతో, ఆ అద్భుతాలను తిలకించారు. చివరన జీవితంలో తొలిసారి రైలు చూసినవారి అనుభూతి వర్ణనాేతీతం.

విప్లవోద్యమం దెబ్బతినిపోవడం నిజం

సాయుధ పోరాట తాత్కాలిక విరమణ ప్రకటన విడుదల చేసిన సందర్భంగా ప్రజల కోసం, పార్టీ కేడర్ల కోసం విడుదల చేసిన రెండు అప్పీల్ పత్రాలలో విప్లవోద్యమం దెబ్బతినిపోవడానికి దారి తీసిన పరిస్థితులను స్థూలంగా పేర్కొన్నాను. ఆ సందర్భంగానే మారిన సామాజిక పరిస్తితులను అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నాను. నేను, నాతో ఆయుధాలు వదిలి విశాల ప్రజల మధ్యకు వచ్చిన వారిలో నుండి 52 మందిమి కలిసి మహారాష్ట్ర దర్శన్ చేసిన సందర్భంగా నేను కొన్ని కొత్త విషయాలను తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను.

నీటిపారుదల లేదు కానీ డ్రిప్ ఇరిగేషన్

గడ్ చిరోలీ నుండి మా ఊరు పెద్దపల్లి వరకు చేసిన తొలి ప్రయాణంలో గమనించినదానికి, ఈసారి దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా చేసిన బస్సు ప్రయాణంలో గమనించినదానికిచాలా తేడాలున్నాయి. తెలంగాణలో ఎటు చూసినా వరి పొలాలు, పత్తి పంట, బొగ్గు గనులు, విపరీతమైన కట్టడాలు, మధ్య మధ్య అడవీ, కొండలు అగుపడితే, నాగ్ పుర్ నుండి బుల్డానా వరకు, బుల్డానా నుండి ఔరంగాబాద్, ఔరంగాబాద్ నుండి వర్ధా వరకు ఎటు చూసినా సువిశాలమైన సోయాబీన్ పంట చేలే అగుపడ్డాయి. తెలంగాణలో నా చిన్నతనంలోనే పోచంపాడు ప్రాజెక్ట్ ద్వారా నీటి పారుదల కాలువలు ఉనికిలోకి రాగా, ఇప్పుడు తిరిగిన మహారాష్ట్ర ప్రాంతంలో నాకు ఎక్కడా కాలువల ద్వారా నీటి పారుదల కంటపడలేదు. సోలార్ పానెళ్లతో పంపు సెట్లతో డ్రిప్ ఇరిగేషన్ మాత్రం గమనించాను. కొన్ని చోట్ల చాలా అరుదుగా అరటి తోటలు అగుపడితే, కొన్ని చోట్ల సంత్రా పళ్ల తోటలు కూడ అరుదుగానే కానవచ్చాయి.

వ్యవసాయంలో కార్పొరేటీకరణ నిజం

నాది బస్సు ప్రయాణం కాబట్టి, బస్సు దిగి పరిశీలించాల్సిన అవసరానికి ఇవి ఒక పరిచయం మాత్రమే. ‘గుర్రం దిగి పిచ్చుకలను డిసెక్షన్ చేయాల్సిన’ ఆవశ్యకత ఎలాగూ వుంది. ఈ తొలి పరిశీలన రేపటి అధ్యయనానికి బీజాలు నాటింది. త్వరిత మార్పులను కళ్లకు కట్టింది. వ్యాపార పంటల విస్తీర్ణత ఊహకందని విధంగా పెరగడం, వ్యవసాయంలో యంత్రాల వినియోగం, మార్కెట్ కోసమే ఉత్పత్తి చేయడం, వ్యవసాయ పంటలు సరుకుగానే ఉనికిలోకి రావడం చూస్తే, వ్యవసాయంలో కార్పొరేటీకరణ అనే మా అంచనా చాలా సరైందేనని నెమరు వేసుకున్నాను. బ్రిటిష్ వారి రాకతో వ్యవసాయంతో మొదలైన మార్పులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఈనాడు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

గరీబోళ్లకు మంచోళ్లు.. ఉన్నోళ్లకు వారంటే భయం

చివరాఖరున ఒక రెండు ఘటనలు మీతో పంచుకుంటాను. మేం బుల్డానా రోడ్ పై శేగాం వెళ్తున్నపుడు మార్గ మధ్యంలో రోడ్ పక్కన ఒక చిన్న పేద హోటల్ వద్ద మునిమాపు వేళ ఛాయ్ తాగడానికి ఆగాం. అక్కడ రోడ్ కు రెండు వైపులా అడవీ, బోడి గుట్టలు వున్నాయి. మావాళ్లు మూత్రానికి వెళ్లడంతో నేను ‘జాగ్రత్త’ అన్నాను. వెంటనే హోటల్ సర్వర్ కం మాలక్ ‘ఇపుడు మహారాష్ట్రలో ఏ భయం లేదు’ అన్నాడు. మా మెడలలో వున్న ఐడెంటిటీ కార్డులపై పేరు తప్ప మరేదీ లేకుండా గడ్ చిరోలీ మాత్రమే రాసి వుండడంతో, ‘గడ్‌చిరోలీలో కూడ నక్సలైట్లు లేరిపుడు’ అన్నాడు. అప్పుడు ‘వారు మంచివారా, చెడ్డవారా’ అని నేను ప్రశ్నిస్తే, మొదట ‘చెడ్డవారు’ అని వెంటనే ‘గరీబోళ్లకు మంచివారు, ఉన్నోళ్లకు వాళ్లంటే భయం’, అన్నాడు.

మావోయిస్టులు 'మెసియా'లు

మేం అజంతా వెళ్లాం. అక్కడ ఒక గుహ చూడడానికి వెళ్లినపుడు అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డుకు మేం గడ్ చిరోలీ నుండి వెళ్లినవారమనే విషయం మా ఐ.డీ ద్వారా తెలిసింది. ఆయనతో కూడ నక్సలైట్ల ప్రస్తావన వచ్చింది. ఆయన ఒక్క మాటలో వాళ్లు ‘మెసియా’ (దైవ సమానులు) అన్నాడు. అప్పుడు నాకు ఒక వైపు నా 45 ఏళ్ల విప్లవ ప్రస్తానంలో అనేక ప్రాంతాల పేదలకు మా గురించి తెలియడం సంతోషం అన్పించి, కళ్లు చెమ్మగిల్లితే, ఆ మరుక్షణమే మా ఓటమి కారణం వారి మాటలతో మరింత ధ్రువపడింది. ప్రజలకు దూరమయ్యామనే నా అభిప్రాయం అక్షర సత్యం అని మరింత గట్టిగా నాలో బలపడింది. ఉద్యమ ప్రభావానికి, సంఘటిత శక్తికి మధ్య తేడా మరో మారు రుజువైంది.

భవిష్యత్ అధ్యయనానికి ఆరంగేట్రం

ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప దైవ దూతలు ప్రపంచాన్ని మార్చలేరనే సత్యం ఇంకా తెలియని వారు పేదల దగ్గరికి వెళ్లితే తప్ప తెలియదని ఎవరికైనా నా అనుభవం ద్వారా మరింత గట్టిగా చెప్పగలను అన్పించింది. ఈ ప్రాంతాలేవీ గతంలో విప్లవోద్యమ ప్రాంతాలు కావు అనేది కూడ ఇక్కడ నేను చెప్పదలచుకున్నాను. చాలా పరిమితమైన అడవి ప్రాంతానికి దశాబ్దాల పాటు కట్టివేయబడిన మాకు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత కోటానుకోట్ల శ్రమజీవులను కలవడం ద్వారానే పూర్తవుతుంది. భవిష్యత్ అధ్యయనానికి ఈ పర్యటన ఒక ఆరంగేట్రం.

(నాలుగున్నర దశాబ్దాల ఉద్యమ చరిత్రలో మల్లోజుల తన పేరుతో రాసిన తొలి వ్యాసం దిశలో...)

మల్లోజుల వేణుగోపాల్

మావోయిస్టు పార్టీ పూర్వ పొలిట్ బ్యూరో సభ్యుడు

88560 38533

Next Story