- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిటన్ నూతన ప్రధానిగా లేబర్ పార్టీ నాయకుడు.. బాధ్యతల స్వీకరణ
బ్రిటన్ నూతన ప్రధానిగా లేబర్ పార్టీ నాయకుడు, మాంచెస్టర్ మాజీ మేయర్ యాండి బర్న్‌హామ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిటన్ నూతన ప్రధానిగా లేబర్ పార్టీ నాయకుడు, మాంచెస్టర్ మాజీ మేయర్ యాండి బర్న్‌హామ్ (56) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత దశాబ్ద కాలంలో బ్రిటన్‌కు ఆయన 7వ ప్రధాని. బ్రిటన్ రాజు మూడో చార్లెస్ ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం, 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. లండన్ కేంద్రీకృత పాలనకు స్వస్తి చెప్పి, దేశంలోని అన్ని ప్రాంతాలకూ అధికారాన్ని విస్తరింపజేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. దీని కోసం మాంచెస్టర్‌లో ‘నంబర్ 10 నార్త్’ (No. 10 North) పేరిట ప్రాంతీయ పాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తన నూతన పాలనా శైలిని ఆయన ‘మాంచెస్టరిజం’గా పేర్కొన్నారు.
ముఖ్యమైన తొలి నిర్ణయాలు..
దేశంలో నిరాశ్రయతను (Homelessness) పూర్తిగా నిర్మూలించడమే తన తొలి ప్రాధాన్యమని తెలిపారు. పెరిగిన జీవన వ్యయం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలతో పాటు, త్వరలోనే 10 ఏళ్ల నూతన ప్రణాళికను ఆవిష్కరిస్తామని చెప్పారు. ప్రజా ప్రయోజన సేవలు (Utilities) ప్రభుత్వం/ప్రజల పర్యవేక్షణలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బర్న్‌హామ్‌కు యూరోపియన్ యూనియన్ (EU) పట్ల సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ, తన ప్రస్తుత పదవీకాలంలో బ్రిటన్‌ను తిరిగి ఈయూలో చేర్చే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. నాటో (NATO) బలోపేతం, ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు కొనసాగింపు, అమెరికాతో భద్రతా భాగస్వామ్యానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు.
‘చిరునవ్వుతో నిష్క్రమిస్తున్నా’: కీర్ స్టార్మర్
అంతకుముందు ప్రధాని పదవికి రాజీనామా చేసిన కీర్ స్టార్మర్, బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన లేబర్ పార్టీ నాయకుడిగా నిలిచారు. రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘గర్వంగా, ముఖంలో చిరునవ్వుతో వీడ్కోలు చెబుతున్నాను. నూతన ప్రధాని బర్న్‌హామ్‌కు నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.






