- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయాలనే లక్ష్యంగా వరుస చోరీలు.. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను వియం బంజర పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, పెనుబల్లి : ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను వియం బంజర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.536 కిలోల వెండి వస్తువులు, ఒక కారు, ఒక మోటార్‌సైకిల్‌తో పాటు చోరీలకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో చిక్కిన నిందితులు..
పోలీసుల కథనం ప్రకారం.. వియం బంజర పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా జూలై 19 సాయంత్రం సీతారామపురం గ్రీన్‌ఫీల్డ్ హైవే సమీపంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ సమయంలో చోరీ సొత్తును విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరుకు వెళ్తున్న షేక్ జానీ అలియాస్ జానీ షరీఫ్, పేరాల నరసింహారావు అలియాస్ బాబీ, అర్వ ఉదయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా ఆలయ చోరీల గుట్టు రట్టయింది.
పాత నేరస్తులే..
అరెస్టైన ముగ్గురూ పాత నేరస్తులేనని పోలీసులు తెలిపారు. షేక్ జానీ, అర్వ ఉదయ్‌కుమార్‌లపై గతంలో లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో డెకాయిటీ కేసు నమోదై ఉంది. షేక్ జానీపై కొత్తగూడెం టూ టౌన్, పాల్వంచ, ఇల్లందు పోలీస్ స్టేషన్లలో ఇళ్ల దొంగతనం కేసులు ఉన్నాయి. పేరాల నరసింహారావుపై హైదరాబాద్ ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు ములకలపల్లి, నేలకొండపల్లి, గోకవరం పోలీస్ స్టేషన్లలో ఆలయ దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు..
విచారణలో నిందితులు పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కొత్తగూడెం, పెనుబల్లి, తల్లాడ, వేంసూర్ మండలాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గోకవరం ప్రాంతంలోని ఆలయాల్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన వియం బంజర పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.






