Ukrain: ఉక్రెయిన్‌లో ఘోర విషాదం.. రష్యా దాడిలో నలుగురు భారతీయుల మృతి

by S Gopi |

గాయపడిన భారతీయుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అతనికి అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపడుతోందని తెలిపింది.

Ukrain: ఉక్రెయిన్‌లో ఘోర విషాదం.. రష్యా దాడిలో నలుగురు భారతీయుల మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం మరోసారి భారతీయ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు నుంచి బయలుదేరుతున్న ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరో భారతీయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది. జూలై 19 సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్న నౌకలో ఐదుగురు భారతీయులు ఉన్నారని, వారిలో నలుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొంది. గాయపడిన భారతీయుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అతనికి అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపడుతోందని తెలిపింది. ఉక్రెయిన్ నౌకాదళం వివరాల ప్రకారం, గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకపై రష్యా మూడు క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసింది. నౌకలో భారత్‌తో పాటు సిరియాకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. ఎల్ఎస్ఈజీ డేటా ప్రకారం, ఈ నౌక ముంబైకి చెందిన ఓషన్ గ్రేస్ షిప్పింగ్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. దాడి అనంతరం రాత్రంతా గాలింపు, సహాయక చర్యలు కొనసాగగా, పలువురిని రక్షించినట్లు ఉక్రెయిన్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రష్యా నుంచి వెంటనే ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన భారతీయుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన విదేశాంగ మంత్రిత్వ శాఖ, గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అలాగే, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, అంతర్జాతీయ నౌకాయానం, వాణిజ్య స్వేచ్ఛకు భంగం కలిగించడం పూర్తిగా ఖండించదగిన చర్యలని భారత్ స్పష్టం చేసింది. ఇలాంటి దాడులు వెంటనే నిలిపివేయాలని కూడా కోరింది. మరోవైపు, ఒడెసాపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మరో క్షిపణి దాడిలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడిలో కీలక మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ప్రపంచ ధాన్య ఎగుమతులకు కీలక కేంద్రంగా ఉన్న ఒడెసా పోర్టు గత కొంతకాలంగా వరుస దాడులకు గురవుతోంది.

Next Story