లిథియం-అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్‌వోల్ట్‌తో ఎక్సైడ్ భాగస్వామ్యం!

by Harish |
లిథియం-అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్‌వోల్ట్‌తో ఎక్సైడ్ భాగస్వామ్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిథియం-అయాన్ సెల్ తయారీ కోసం కీలక ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. చైనాకు చెందిన ఎస్‌వోల్ట్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీతో దీర్ఘకాలిక సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు గురువారం వెల్లడించింది. కొన్నేళ్ల పాటు కొనసాగే ఈ ఒప్పందం ప్రకారం.. ఎస్‌వోల్ట్ భారత్‌లో లిథియం-అయాన్ సెల్ తయారీకి అవసరమైన టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, వాణిజ్య పరంగా హక్కులు, లైసెన్స్‌ను ఎక్సైడ్ కంపెనీకి ఇవ్వనుంది. అదనంగా అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాయాన్ని కూడా ఎస్‌వోల్ట్ కంపెనీ అందిస్తుంది. ఎస్‌వోల్ట్ కంపెనీ ప్రధానంగా లిథియం-అయాన్ బ్యాటరీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీల ఉత్పత్తి, అభివృద్ధి చేస్తున్న గ్లోబల్ హైటెక్ కంపెనీ.

ప్రస్తుతం ఈ కంపెనీ అంతర్జాతీయంగా పెరుగుతున్న బ్యాటరీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఎస్‌వోల్ట్‌తో ఒప్పందంపై స్పందించిన ఎక్సైడ్ ఎండీ, సీఈఓ సుబీర్ చక్రవర్తి.. ఎస్‌వోల్ట్‌తో భాగస్వామ్యం ద్వారా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో మరింత ముందుకెళ్లగలమనే నమ్మకం ఉందన్నారు. ఎస్‌వోల్ట్‌కు ఉన్న బలమైన టెక్నాలజీ, ఆర్అండ్‌డీ సామర్థ్యాలు, లిథియం-అయాన్ బ్యాటరీ అనుభవంతో దేశీయంగా తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది దేశీయ అవసరాలను తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో అత్యంత నాణ్యమైన బ్యాటరీలు, ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలను ఎక్సైడ్ అందిస్తుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story