ఎన్నికల వేళ బయటపడ్డ బ్లండర్ మిస్టేక్స్.. అధికారుల తీరుపై పార్టీలు ఆగ్రహం

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-07 04:51:55  IST  )

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారింది.

ఎన్నికల వేళ బయటపడ్డ బ్లండర్ మిస్టేక్స్.. అధికారుల తీరుపై పార్టీలు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జాబితాపై వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా అధికారులు అశాస్త్రీయంగా జాబితాను రూపొందించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఒక వార్డు పరిధిలోని ఓటర్లను మరొక వార్డు పరిధిలోని మార్చారని, గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వేసిన పోలింగ్ బూత్‌లో కాకుండా ఎక్కడో ఉన్న వార్డులోకి చేర్చారనే ఫిర్యాదు ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని దాదాపుగా ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో జరిగినట్లుగా గుర్తించారు.

ఫిర్యాదులు ఇలా..

కొన్ని మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేయగా.. ఓటరు జాబితా రూపకల్పనలో గందరగోళం నెలకొన్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీలోని ఒక వార్డులో మూడు వేల ఓటర్లు ఉంటే.. అదే మున్సిపాలిటీ పరిధిలోని మరొక వార్డులో వెయ్యి మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. కొన్ని చోట్ల అపార్ట్ మెంట్ ఇంటి నంబర్లను సరిగా నమోదు చేయలేదు. మరికొన్ని చోట్ల ఇంటి నంబర్లకు బదులుగా ‘నెలల పేర్లు’ రాయడం చర్చనీయాంశంగా మారింది. వార్డుల సరిహద్దులను నిర్ణయించడంలో మున్సిపల్ అధికారులు హడావుడిగా పని చేయడంతో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఫిర్యాదులు అందాయి. చిన్న చిన్న మన్సిపాలిటీల్లో సైతం వందల సంఖ్యలో ఓటరు జాబితాపై ఫిర్యాదులు రావడం అధికారుల పనితీరుకు, నిర్లక్ష్యానికి, నిదర్శనమని రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

రాజకీయ పార్టీల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో ఓటరు జాబితాలోని లోపాలు బయటపడ్డాయి. దీంతో మున్సిపల్ అధికారుల తీరుపై రాజకీయ పార్టీల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఓటరు జాబితాను ఏ విధంగా తయారు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓటరు జాబితాను సమగ్రంగా తయారు చేసి మాత్రమే ఓటరు తుది జాబితాను ప్రచురించాలని కోరుతున్నారు. ఇదే జాబితాను ప్రకటిస్తే కోర్టుకు వెళ్లి ఓటర్లకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హెచ్చరిస్తున్నారు.

సమయం ఇవ్వకపోవడంతోనే..!

ఓటరు ముసాయిదా జాబితా రూపకల్పనకు సరైన సమయం ఇవ్వకపోవడంతోనే కొన్ని పొరపాట్లు జరిగాయని మున్సిపల్ అధికారులు అంటున్నారు. ఎన్నికలకు వెళ్లాలనే హడావుడిలో ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఇచ్చిన తేదీలు ఒత్తిడికి గురి చేసే విధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలకు కేంద్ర ఎన్నికల సంఘం గత నవంబర్ 15 నాటికి రూపొందించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించారు. ఇందులో అక్టోబరు 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే అర్హతతో ఈ జాబితాను రూపొందించారు. నవంబర్ 15 తరువాత దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు ఇందులో ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు.. మున్సిపాలిటీల్లో పోటీ చేయడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ కూడా దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. అయితే సెక్షన్ 32 ప్రకారం రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం నేరమని, దానిని గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరిస్తున్నారు. వీటిపై జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నారు.

నేడు వీడియో కాన్ఫరెన్స్... గడువు పొడిగించే ఛాన్స్!

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన పై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా ఓటరు జాబితా రూపకల్పన ఎంత వరకు వచ్చిందనే విషయంపై సమీక్షించనున్నారు. ఎలాంటి, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనే విషయంపై ఆమె సమాచారాన్ని సేకరించనున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు, కలెక్టర్ల నుంచి ఇప్పటికే ఎన్నికల సంఘానికి వినతులు అందాయి. ఈ నేపథ్యంలో ఓటరు తుది జాబితా ప్రచురించే గడువు మరికొంత పెంచాలని వారు కోరారు. దీని ద్వారా జాబితాను తప్పులు లేకుండా రూపొందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తప్పులు ఉంటే ఎన్నికల నిర్వహణపైనే ప్రభావం చూపే ప్రమాదముందని అంచనా వేస్తున్న అధికారులు.. ఓటరు తుది జాబితా తయారు చేసే గడువును పెంచే అవకాశం ఉందని సమాచారం. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ తరువాత నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

Read More..

TG Municipal Elections: అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసేది ఇలాగే!

Next Story