వికారాబాద్ జిల్లాలో సంచలనం.. స్వామీజీ ఆశ్రమంలో గంజాయి చెట్లు

by Malleboina Mahesh |

వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఆశ్రమంలో గంజాయి సాగు గుట్టురట్టు.. 25 గంజాయి మొక్కలు, ఎండు గంజాయి సీజ్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు!

వికారాబాద్ జిల్లాలో సంచలనం.. స్వామీజీ ఆశ్రమంలో గంజాయి చెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి చెట్లను పెంచడం వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లాల్సిన ఆశ్రమంలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి తోట వ్యవహారాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ సంచలన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో వెలుగు చూసింది. మండల పరిధిలోని గోవిందరావుపేట శివారులో ఉన్న ఒక స్వామీజీ ఆశ్రమంలో భారీగా గంజాయి సాగు జరుగుతోందని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ నమ్మదగిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సదరు ఆశ్రమంపై ఆదివారం ఆకస్మిక దాడులు (Surprise Raids) నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఆశ్రమం ఆవరణలో సాగు చేస్తున్న 25 పెద్ద గంజాయి మొక్కలను, లోపల నిల్వ ఉంచిన ఎండు గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఒక స్వామీజీ తో పాటు మాతాజీ నివసిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. భక్తులు, స్థానికులకు అనుమానం రాకుండా ఆధ్యాత్మికత ముసుగులో ఇంత పెద్ద ఎత్తున గంజాయి సాగుకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నార్కోటిక్స్ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? గంజాయిని ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి స్వామీజీ, మాతాజీలను విచారిస్తున్నారు.

Next Story