- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మగాళ్లంటేనే అసహ్యం.. నా భర్తను బెల్ట్‌తో కొడతా’.. ఓటీటీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీచర్
ప్రముఖ రియాలిటీ ఓటీటీ షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (సీజన్ 2) తాజా ఎపిసోడ్ తీవ్ర వివాదానికి దారితీసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ రియాలిటీ ఓటీటీ షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (సీజన్ 2) తాజా ఎపిసోడ్ తీవ్ర వివాదానికి దారితీసింది. బిహార్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్, మాజీ ఉపాధ్యాయురాలు సాక్షి ఝా.. స్టాండప్ కామెడీ పేరుతో పురుషులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తనను తాను పురుష ద్వేషిగా (మ్యాన్ హేటర్) పరిచయం చేసుకున్న ఆమెకు.. షో చరిత్రలోనే తొలిసారిగా జడ్జీలు, ప్రేక్షకులు ఏకగ్రీవంగా ‘సున్నా’ (0) మార్కులు ఇచ్చి పంపించేశారు.
వేదికపై సాక్షి ఝా వివాదాస్పద వ్యాఖ్యలు..
నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వేదికగా సమయ్ రైనా హోస్ట్ చేస్తున్న ఈ కామెడీ టాలెంట్ షోలో సాక్షి ఝా మాట్లాడుతూ.. మగాళ్ల అహంకారాన్ని దెబ్బతీయడమే తనకు కిక్ ఇస్తుందని చెప్పింది. భవిష్యత్తులో పెళ్లయ్యాక మద్యం తాగి బెల్ట్‌తో తన భర్తను చితకబాదడమే తన జీవిత ఆశయమంటూ వేదికపై ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనికి గల కారణాన్ని హోస్ట్ ప్రశ్నించగా.. అది తన కుటుంబంలో తరాలుగా వస్తున్న మానసిక గాయం (జనరేషనల్ ట్రామా) అని బదులిచ్చింది. అందువల్లే మగాడైన తన తండ్రిని, తాతను, తమ్ముడిని సైతం తాను ద్వేషిస్తానని కుండబద్దలు కొట్టింది. సొంత రాష్ట్రమైన బిహార్ ప్రజలపైనా వెటకారపు వ్యాఖ్యలు చేసింది.
చరిత్రలో తొలిసారిగా ‘జీరో’
సాక్షి ఝా వ్యాఖ్యలతో అవాక్కైన జడ్జీల ప్యానెల్ (తన్మయ్ భట్, విశాల్ దద్లానీ, రఘు రామ్, యశ్‌రాజ్ మెహ్రా) ఆమెకు ఏకగ్రీవంగా జీరో మార్కులు వేశారు. అక్కడున్న ప్రేక్షకులను రేటింగ్ అడగ్గా.. వారంతా ఏకతాటిపై నిలబడి జీరో అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఈ సీజన్‌లో ఐదుగురు జడ్జీలు, ప్రేక్షకుల నుంచి క్లీన్ స్వీప్‌గా సున్నా మార్కులు సాధించిన ఏకైక కంటెస్టెంట్‌గా సాక్షి ఝా నిలిచింది.
మండిపడుతున్న నెటిజన్లు
ఈ ఎపిసోడ్ బయటకు వచ్చిన కొద్దిసేపటికే సాక్షి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఎక్స్ (ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి. ఆధునిక కాలంలో ‘కూల్’గా కనిపించడం కోసం ఒక వర్గాన్ని కించపరుస్తూ ద్వేషం పెంచేలా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది ఫెమినిజం కాదని ‘విషపూరిత స్త్రీవాదం (టాక్సిక్ ఫెమినిజం)’ అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి నకిలీ ఫెమినిస్టుల వల్లే సమాజంలో నిజమైన స్త్రీవాదానికి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






