దట్టమైన పొగమంచు.. గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాలు, ప్రయాణికుల ఇబ్బందులు

by Malleboina Mahesh |   (  Updated:2026-03-06 10:56:03  IST  )

గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు. క్లియరెన్స్ లేక గాల్లోనే చక్కర్లు కొట్టిన దేశీయ, అంతర్జాతీయ విమానాలు. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు.

దట్టమైన పొగమంచు.. గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాలు, ప్రయాణికుల ఇబ్బందులు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఎండలు దంచికొడుతున్న క్రమంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయాన్నే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ బగ్గుమంటున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం (Gannavaram International Airport)లో ఈ రోజు ఉదయం విచిత్ర వాతావరణం నెలకొంది. గన్నవరం ప్రాంతంలో ఉదయం దట్టమైన పొగమంచు (Dense fog) ఏర్పడింది. ఈ కారణంగా ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సిన విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం నుంచే రన్‌వే కనిపించనంతగా పొగమంచు ఆవరించడంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వివిధ నగరాల నుంచి వచ్చిన విమానాలు గమ్యస్థానానికి చేరుకున్నప్పటికీ, సేఫ్ ల్యాండింగ్‌ (Safe landing)కు క్లియరెన్స్ లేకపోవడంతో గంటల తరబడి గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.

ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి దేశీయ నగరాలతో పాటు సింగపూర్, ఇస్తాంబుల్ వంటి అంతర్జాతీయ ప్రాంతాల నుంచి వచ్చిన విమానాలు కూడా ల్యాండ్ అవ్వలేకపోయాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు గాలిలోనే వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఆకస్మిక అంతరాయంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందడమే కాకుండా, ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు ప్రభావం తగ్గే వరకు విమానాల రాకపోకల్లో జాప్యం కొనసాగుతుందని, వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతి ఇస్తామని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

అసోంలో కుప్పకూలిన సుఖోయ్‌-30 ఎంకేఐ విమానం.. ఇద్దరు పైలట్లు దుర్మరణం

Next Story