- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు గమనిక.. 22న పల్లవోత్సవం
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 22న పల్లవోత్సవం నిర్వహించనుంది....

దిశ, వెబ్ డెస్క్: మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 22న పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ నిర్వహించనున్నారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఊరేగింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ఆ తర్వాత స్వామిఅమ్మవారిని కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.
మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం
శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూరి విరాళాలు అందించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి అందించారు.
ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతిరోజూ 5 కేజీల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా, అది నేటికీ కొనసాగుతోంది.
మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతినెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేస్తారు.






