భారీ పేలుడులో 17 కి చేరిన మృతుల సంఖ్య.. సీఎం దిగ్బ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by Malleboina Mahesh |   (  Updated:2026-03-01 09:31:37  IST  )

నాగ్‌పూర్ పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రభుత్వంతో పాటు సంబంధిత కంపెనీ కూడా బాధితుల కుటుంబాలను ఆదుకుంటుందని సీఎంఓ (CMO) స్పష్టం చేసింది.

భారీ పేలుడులో 17 కి చేరిన మృతుల సంఖ్య.. సీఎం దిగ్బ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని వేట్లపాలెం ఘటన మరువక ముందే మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు (Huge explosion) సంభవించింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ విషాద సంఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది. ఈ ఘోర ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Chief Minister Devendra Fadnavis) స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో ఇప్పటివరకు 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన ధృవీకరించారు. గాయపడిన వారిని తక్షణమే మెరుగైన చికిత్స కోసం నాగ్‌పూర్‌కు తరలించామని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు పెసో (PESO), డిష్ (DISH) వంటి సాంకేతిక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించిన ప్రభుత్వం, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

కాగా రావుల్‌గావ్‌లోని పేలుడు పదార్థాల కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ప్రభుత్వ సాయంతో పాటు, ప్రమాదం జరిగిన సంబంధిత కంపెనీ కూడా బాధితుల కుటుంబాలకు విడిగా ఆర్థిక సహాయం అందజేస్తుందని మహారాష్ట్ర సీఎంఓ (CMO) స్పష్టం చేసింది. అలాగే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సీఎం సూచించారు.

భారీ పేలుడు.. 15 మంది దుర్మరణం, 15 మందికి తీవ్ర గాయాలు

Next Story