- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త నిబంధనలతో వచ్చిన చిక్కులు.. భారీగా తగ్గనున్న ‘పీఎం కిసాన్’ లబ్ధిదారులు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంతో పోలిస్తే.. పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య సగం కూడా ఉండడం లేదు. ప్రతి పంట సీజన్ లో దాదాపు 69 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండగా, కేంద్రం మాత్రం 31.19 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ ను పరిమితం చేసింది. పథకం ప్రారంభమై ఏడేళ్లు గడుస్తున్నా.. అర్హతకు సంబంధించి కటాఫ్ తేదీ (2019 ఫిబ్రవరి 1)ని మార్చకపోవడంతో కొత్త పట్టాదారు పాసుబుక్కులు పొందిన లక్షలాది మంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. కేవలం వారసత్వంగా (విరాసత్) భూమి పొందిన వారికి మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
తగ్గుతున్న లబ్ధిదారులు
రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య మొదట్లో పెరిగినా.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నది. 2018–19లో రాష్ట్రంలో తొలివిడతలో 26.61 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. 2019–20 రెండో విడతలో ఈ సంఖ్య 34.34 లక్షలకు పెరిగింది. ఏడో విడతలో 37.49 లక్షల మంది లబ్ధి పొందారు. తొమ్మిదో విడత నుంచి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గతేడాది 19వ విడతలో 31.19 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనం అందింది. కొత్త కొత్త నిబంధనలతో వచ్చే 20వ విడత నాటికి మరో 80 వేల మందికి పీఎం కిసాన్ వర్తించకుండా పోయే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం.. కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ భూమి ఉన్నా.. వారిలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల భార్య, భర్తలు, తండ్రీ కొడుకులు ఇద్దరూ వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో గత డిసెంబర్ నాటికి తనిఖీలు చేపట్టి, ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనం పొందుతుంటే.. ఒకరి పేరును జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశముంది.
ఏడేళ్లలో రూ.12 వేల కోట్లు మాత్రమే..
రాష్ట్రంలో ఎకరాన్ని యూనిట్ గా తీసుకొని అర్హులైన ప్రతి రైతుకు సాయం అందిస్తున్నారు. కేంద్రం మాత్రం ‘రైతు కుటుంబం’ యూనిట్ గా ఏడాదికి రూ. 6వేలు మాత్రమే అందిస్తున్నది., రాష్ట్రంలో రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంటకాలంలో 69 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్ లో సుమారు రూ. 7వేల కోట్ల జమ చేస్తున్నది. అదే కేంద్రం ప్రతి విడతలో రైతులకు అందించే సాయం రూ. 750 కోట్లకు మించడం లేదు. పీఎం కిసాన్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు రూ. 12,785 కోట్లు మాత్రమే జమ చేశారు.
విశిష్ట గుర్తింపు కార్డులు లేకుంటే పథకాలు కట్
కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఇకపై రైతులందరికీ ఆధార్ తరహాలో 11 నంబర్ల విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి కేంద్ర పథకాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. దీంతో ఆరు నెలలుగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కోసం తంటాలు పడుతున్నారు. డిసెంబర్ వరకు స్థానిక అగ్రికల్చర్ అధికారులే రైతుల ఆధార్ కార్డు, భూమి వివరాల ద్వారా ఫార్మర్ ఐడీ కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటివరకు 70 శాతం మంది రైతులు ఐడీ కోసం వివరాలు అందజేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినా నమోదు ప్రక్రియ పెరగడం లేదు. రైతుల అడ్రస్, పాస్ బుక్ లో ఉన్న అడ్రస్ వేర్వేరుగా ఉండటంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే అనర్హులుగా తేల్చారు. అంతేకాకుండా ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో నిజమైన సన్న, చిన్నకారు రైతులు కూడా వివిధ సాంకేతిక కారణాలతో పీఎం కిసాన్ ప్రయోజనాలకు దూరమవుతున్నారు.
Read More..






