పేరే మారింది.. సాఫ్ట్‌వేర్ అదే.. సమస్యలు అవే!

by Ravi |   (  Updated:2026-01-22 01:16:02  IST  )

భూమి రైతుకు జీవనాధారం. ఆ భూమి హక్కులే ప్రశ్నార్థకంగా మారితే రైతు జీవితం అస్తవ్యస్త మవుతుంది. తెలంగాణలో భూ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ మంచి ఉద్దేశాలతో ప్రారంభమైనప్పటికీ

పేరే మారింది.. సాఫ్ట్‌వేర్ అదే.. సమస్యలు అవే!
X

భూమి రైతుకు జీవనాధారం. ఆ భూమి హక్కులే ప్రశ్నార్థకంగా మారితే రైతు జీవితం అస్తవ్యస్త మవుతుంది. తెలంగాణలో భూ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ మంచి ఉద్దేశాలతో ప్రారంభమైనప్పటికీ, అమల్లో తీవ్ర వైఫల్యానికి లోనై రైతులను నిస్సహాయ స్థితికి నెట్టింది. ధరణి స్థానంలో భూ భారతి వచ్చినా, సమస్యల పరిష్కారం మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉంది. పేర్లు మారాయి, రంగులు మారాయి... కానీ రైతు బాధ మాత్రం మారలేదు.

ధరణిని భూ‌ భారతిగా మార్చినప్పటికీ, మౌలిక సమస్యలు అలాగే ఉన్నాయి. ధరణి ద్వారా ఏర్పడిన భూ సమస్యలు ఇప్పటికీ భూ భారతి ద్వారా పరిష్కారం కాలేదు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దక్కడం లేదు..

రైతులకు మేలు చేయాలని..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ధరణి వ్యవస్థను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూమి హక్కులు (టైటిల్) రెవెన్యూ రికా ర్డుల్లోకి బదిలీ చేయాలనే లక్ష్యంతో, సాఫీగా, సమయానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు స్లాట్ బుకింగ్, తేదీ ఖరారు వంటి విధానాలు ప్రవేశపెట్టింది. కానీ అమల్లో ఘోర వైఫల్యం ఎదురైంది. దీని ఫలితంగా అనేక సమస్యలు తలెత్తాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి ఆధార్ కార్డుల్లో తప్పులు పడ్డాయి, మరికొందరికి పాస్‌ పుస్తకాల్లో పొరపాట్లు చోటు చేసుకున్నాయి. ఆధార్‌లో తప్పులను సరిచేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, భూమికి సంబంధించిన పాస్‌బుక్‌లో పడ్డ తప్పులను సరిచేయడం మాత్రం కష్టసాధ్యంగా మారింది. కొన్ని సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో పడిపోయి, అవసరానికి భూమిని అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి నిషేధిత జాబితాలో పడిన భూములు ఇప్పటికీ బ్లాక్‌లోనే ఉండిపోయాయి.

సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చి..

ఈ ధరణి వైఫల్యమే ప్రధాన కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే గతంలో కలెక్టర్ చేతిలో మాత్రమే ఉన్న అధి కారాన్ని ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీఓలకు కూడా విస్తరించారు. అయినా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆ తప్పులను సరిదిద్దడానికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసి చేసి, ఎటు తేలక ఆశలు వదులుకునే స్థితికి రైతులు చేరుకున్నారు. మా ఊర్లో నిస్సహాయులైన ఒక వృద్ధ దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన దీనికి నిదర్శనం. ఓ పౌరుడు ఓపిక నశించి తహసీల్దార్‌పై కిరోసిన్ పోసి కాల బెట్టిన ఉదంతం కూడా అందరికీ తెలిసిందే. ఒక తహసీల్దార్ బదిలీ అయ్యే రాత్రే దొంగ ప్రొసీడింగ్స్, పాత తేదీలతో నోటీసులు సృష్టించి, అక్రమంగా మ్యుటేషన్లు చేసి పాస్‌బుక్స్‌పై సంతకాలు పెట్టి లక్షల్లో దండుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఇక లంచం ఇవ్వని రైతుల భూములు ఆక్రమణదారుల పేర్లకు మార్చి, వారి నుంచి లంచాలు తీసుకున్న ఉదంతాలు ఎన్నో.. ఇలాంటి సంఘటనలు దాదాపు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్ సరిచేయాల్సిందే!

కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులందరికీ భూ సర్వే చేస్తామని ప్రకటించడం మంచి నిర్ణయమే. దాని ద్వారా కనీసం 70 శాతం సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ రెండేళ్లు గడిచినా ఆ హామీ అమల్లోకి రాలేదు. ప్రభుత్వం, తలుచుకుంటే భూ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించగలదు కదా? ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన చలాన్ స్కామ్ ద్వారా వ్యవస్థలో అవినీతి ఇంకా కొనసాగుతోందని స్పష్టమైంది. డేటాను తారుమారు చేయగల లోపాలు ఉన్నాయని రుజువైంది. వాటిని తక్షణమే సాఫ్ట్‌వేర్ మార్పుల ద్వారా సరిచేయాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో నిజమైన మార్పు రాలేదు.. మ్యుటేషన్లకు లంచాలు, కార్యాలయాల చుట్టూ రైతుల తిరుగడాలు యథావిధిగా కొనసాగుతుండటంతో సమయానికి వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి. పైగా అవసరాలకు భూమిని అమ్ముకోలేక, కాలానుగుణంగా దున్నుకోలేక రైతు నిరాశలో కూరుకుపోతున్నాడు. ఇంకెన్నాళ్లు రైతులకు ఈ తండ్లాట?

ప్రజల నమ్మకం కోల్పోతే..

ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత సొమ్ము, ఎంత భూమి కూడబెట్టుకోవాలన్న లెక్కలకంటే, ప్రజల మెప్పు పొందేలా పాలన సాగించడమే ముఖ్యం. ప్రజల నమ్మకం కోల్పోతే ఏ రంగు పాస్‌బుక్, ఏ కొత్త పేరు కూడా ప్రభుత్వాన్ని కాపాడలేవు. నాయకులు ప్రజల సేవకులుగా ఉండాలి. వారు ప్రవేశ‌పెట్టే ప్రతి పథకం వ్యక్తిగత లాభాల కోసం కాకుండా ప్రజల కోసం ఉండాలి. లేదంటే ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వరు. ఆ పరిస్థితి రాకముందే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

-సయ్యద్ రఫీ,

సామాజిక వేత్త

[email protected]

Next Story