నర్సంపేట మున్సిపల్‌లో పోటాపోటీ

by Malleboina Mahesh |   (  Updated:2026-02-10 04:21:56  IST  )

నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలు లీడింగ్ ఉన్న అభ్యర్థులకూ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులు, రెబల్ అభ్యర్థులతో అంచనా తలకిందులవుతుందా అన్న అనుమానాన్ని పెంచుతోంది.

నర్సంపేట మున్సిపల్‌లో పోటాపోటీ
X

దిశ, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలు లీడింగ్ ఉన్న అభ్యర్థులకూ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులు, రెబల్ అభ్యర్థులతో అంచనా తలకిందులవుతుందా అన్న అనుమానాన్ని పెంచుతోంది. ఈ క్రమంలో గెలుపు పై మొదటి నుండి ధీమాగా ఉన్న అభ్యర్థులు సైతం పగలు రాత్రి తేడా లేకుండా వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. పార్టీ క్యాడర్ బలంగా ఉన్నా, కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నా రోజురోజుకూ మారుతున్న ఓటర్ల మనోగతం బేరీజు వేసుకుని శ్రమించారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో పలుకుబడి, పరిచయాలు ఉన్న నేతలను వార్డుల్లో తిప్పుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు.

నమ్మకం సడలుతోంది..!

మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులకు వాస్తవ పరిస్థితిని గమనిస్తూ ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ వేసేటప్పుడు ఉన్న ధైర్యం ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో ఉండటం లేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల గెలుస్తామన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఈక్రమంలోనే ప్రధాన అనుచరుల వద్ద పదేపదే చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నెగిటివ్ ముంచేస్తాయా..?

మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ బలంతో పలువురు అభ్యర్థిగా బరిలో నిలుచున్నారు. కాగా వార్డుల్లో జరుగుతున్న మార్పులతో అభ్యర్థుల గెలుపుపై నెగిటివ్ పెరుగుతుంది. అప్పటి వరకు నమ్మకంగా ఉన్న వ్యక్తులు పార్టీలు మారడం, టికెట్ తమ వాళ్లకు దక్కలేదని కొందరు, ప్రాధాన్యత ఉండకపోవడంతో మరికొందరు చివరి నిమిషంలో సొంత పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారానికి తెర లేపడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ప్రభావం పార్టీ అభ్యర్థుల గెలుపు పై పడనుంది.

అయోమయంలో ఓటర్లు..

నర్సంపేట పట్టణంలో దాదాపు 40 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. వార్డుల్లో రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్న ప్రచారాలతో అయోమయానికి గురవుతున్నారు. ఓ వైపు పార్టీ నాయకులు ప్రచారం చేస్తుండగా, మరోవైపు తమ కమ్యూనిటీ లీడర్లు మరో వైపు ప్రచారం చేస్తుండటంతో ఎవరికి వేయాలో తేల్చుకోలేకపోతున్నారు. చివరికి ఎవరికి వేయాలి అనే సందేహం కుటుంబ సభ్యుల్లో వ్యక్తం అవుతోంది.

గెలుపు కోసం అభ్యర్థుల ఆరాటం.. ఓటర్లకు గిఫ్ట్‌లు, మద్యం పంపిణీ షురూ

Next Story