- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెలుపు కోసం అభ్యర్థుల ఆరాటం.. ఓటర్లకు గిఫ్ట్‌లు, మద్యం పంపిణీ షురూ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇక బీజేపీ సైతం పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదనే విమర్శలూ లేకపోలేదు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు..
ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలు, సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఇక ఇండ్ల వద్దకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ, గిఫ్ట్‌లు, మద్యం పంపిణీ కార్యక్రమాలకు తెరలేపారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఖరీదుగా మారాయి. షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, ఆమన్‌గల్ మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున డబ్బులు, మద్యం పంచుతున్నట్లు తెలిసింది.
ఎన్నికల సంఘం ఏర్పాట్లు..
మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌కు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 2,996 వార్డులు ఉన్నాయి. మొత్తం 52.43 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు, ఇతరులు 640 మంది ఓటర్లు ఉన్నారు. వీరికిగాను 8,203 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ బాక్సులు, అధికారుల నియామకం, సిబ్బంది కేటాయింపు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం వివిధ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రంగారెడ్డి, ములుగు, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ, వెబ్ కాస్టింగ్, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్ కూడా పాల్గొన్నారు.






