- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్ల ఎన్నికల అసలు అంకానికి తెరలేసింది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్ల ఎన్నికల అసలు అంకానికి తెరలేసింది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోనున్నది. దీంతో బుధవారం నుంచి ఎన్నికల ప్రచారానికి పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ పక్కా ప్లానింగ్‌తో అధికార పార్టీ ప్రిపేర్ అవుతోంది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి తిరిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు జూమ్ మీటింగ్‌ల్లో పాల్గొన్నారని, పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరఫున ఫిబ్రవరి 4 నుంచి జిల్లాల పర్యటనల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించనున్నట్లు తెలిపాయి.
రెబల్స్‌కు భరోసా..
పార్టీలో ప్రధాన సమస్యగా రెబల్స్ అంశాన్ని తీసుకోవాలని, ఎక్కడా రెబల్స్ లేకుండా చూసుకోవాలని నేతలకు సీఎం సూచనలు జారీ చేశారు. రెబల్స్‌ను బుజ్జగించి వారిని పార్టీ కోసం పనిచేసేలా వ్యవహారించాలని, భవిష్యత్‌లో రెబల్స్‌కు.. అసంతృప్తి నేతలకు పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామన్న భరోసాను కల్పించాలని సీఎం ఆదేశాలిచ్చారు. మరోవైపు ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ పార్టీకి ధీటుగా రాజకీయ వ్యూహాలను రచించాని సూచించారు. దీనితో పాటు సీఎం నేడు పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జిలు, డీసీసీ చీఫ్‌లు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో భేటీలు నిర్వహించి క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్నారు.
జిల్లాల పర్యటన..
ఫిబ్రవరి 4వ తేదీ – మిర్యాలగూడ, 5వ తేదీ – చొప్పదండి, 6వ తేదీ – నిజామాబాద్ రూరల్, 7వ తేదీ – పరిగి, 8వ తేదీ – భూపాల్‌పల్లి, 9న మెదక్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, ప్రత్యర్థి పార్టీల చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే అంశాలను ప్రజలకు సీఎం వివరించనున్నారని పేర్కొన్నాయి. ఇప్పటికే మహాబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సీఎం సభలు నిర్వహించారు. కాగా సీఎం సభలతో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాం రావడంతో పాటు విజయావకాశాలు మెరుగుపడుతాయనే అభిప్రాయాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కమిటీ ఆమోదముద్ర..
మున్నిపల్ ఎన్నికల బరిలో దిగే అభ్యర్ధుల ఎంపికకు మంత్రులు చైర్మన్లుగా 15 పార్లమెంట్ నియోజవర్గాలకు స్క్రీనింగ్ కమిటీని వేశారు. దీంతో జిల్లా అధ్యక్షులు, లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలను నియమించారు. వారు అభ్యర్థుల ఎంపికకు సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలు, అభ్యర్థుల బలబలాలను దృష్టిలో ఉంచుకొని జాబితాను తయారు చేశారు. ఆ జాబితాకు సోమవారం టీపీసీసీ ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేస్తూ తీర్మానం చేసింది.






