బరిలో నిలిచేదెవరు? నేడు తేలనున్న బీ-ఫామ్‌ల లెక్క

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-03 03:36:43  IST  )

మున్సిపల్‌ ఎన్నికల్లో బీ- ఫామ్‌ లొల్లి నడుస్తోంది. బీ- ఫామ్‌ ఇచ్చే విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓ కొలిక్కి వచ్చాయి.

బరిలో నిలిచేదెవరు? నేడు తేలనున్న బీ-ఫామ్‌ల లెక్క
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : మున్సిపల్‌ ఎన్నికల్లో బీ- ఫామ్‌ లొల్లి నడుస్తోంది. బీ- ఫామ్‌ ఇచ్చే విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓ కొలిక్కి వచ్చాయి. ఆ అభ్యర్థికే బీ-ఫామ్‌ అందజేయనున్నాయి. అయితే ముందుగా ఇస్తే.. అసంతృప్తులు ఇతర పార్టీల్లోకి జంప్‌ అవుతారనే ఉద్దేశ్యంతో నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని టాక్ వినబడుతుంది. నామినేషన్‌ వేసిన ఇతర అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల్లో 615 మంది, వికారాబాద్‌ జిల్లాలో 519 మంది నామినేషన్లు వేశారు. మంగళవారం నామినేషన్ల ఉప సంహరణ తర్వాత మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరు? అన్నది తేలనున్నది.

అభ్యర్థుల్లో టెన్షన్‌..

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలోని 126 వార్డు స్థానాలకు, వికారాబాద్‌ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఉన్న 100 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ప్రతీ వార్డుకు పోటీలో నిలవడంతో ఎవరికి బీ-ఫామ్‌ వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ అభ్యున్నతికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డామని కొందరు, డబ్బులు ఎన్ని అయినా పెట్టి గెలిచి వస్తామని చెబుతూ బీ-ఫామ్‌ కోసం పలువురు పట్టుబడుతున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోపు బీ -ఫారాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. నామినేషన్లు వేసి రెండు రోజులు అవుతున్నప్పటికీ బీ-ఫామ్స్​‍ ఇవ్వకుండా రాజకీయ పార్టీలు దాటవేత ధోరణిని అవలంభిస్తుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది.

గెలుపు గుర్రాలకే టికెట్లు!.

మున్సిపల్‌ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. దీంతో సోమవారం వరకు కూడా బీ-ఫామ్‌‌లపై అభ్యర్థులకు స్పష్టత లేకుండా పోయింది. ఏకాభిప్రాయం కుదిరిన చోట బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బీ-ఫామ్స్ ఇవ్వగా.. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి వరకు వేచి చూసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులెవరికీ బీ-ఫామ్స్ దక్కలేదు. ఒకరికి బీ-ఫామ్‌ ఇస్తే మిగిలిన వారు ఇతర పార్టీల్లోకి జంప్‌ అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీ సైతం భావిస్తోంది. ఈ కారణంగానే బీఆర్‌ఎస్ పార్టీ సైతం పూర్తి స్థాయిలో బీ-ఫామ్స్ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు వస్తే కొన్ని చోట్ల పోటీకి అవకాశం కల్పించే విషయమై బీఆర్‌ఎస్, బీజేపీ ఆలోచనలు చేస్తున్నాయనే టాక్ వినబడుతుంది. టికెట్‌ దక్కని వారికి బీ-ఫామ్‌‌లు ఇచ్చేందుకు ఇతర రాజకీయ పార్టీలు సైతం ఎదురుచూస్తున్నాయని సమాచారం. ఎలాగైనా చైర్మన్‌ పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలు ఉండడంతో రెబెల్స్ బెడద లేకుండా చూసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందుకు గాను రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌కు భరోసా కల్పించడమో, లేకుంటే ప్యాకేజీలు ఇచ్చి పోటీ నుంచి తప్పించేందుకు బేరసారాలను ముమ్మరం చేస్తున్నారని తెలిసింది. ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు అభ్యర్థులు ఓవైపు సన్నాహాలు చేసుకుంటున్నారు.

రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

Next Story