- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు భీంగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి..!
ఆదిమ గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీమ్ పుట్టిన పురిటిగడ్డకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా వస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్: ఆదిమ గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీమ్ పుట్టిన పురిటిగడ్డకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో గతంలో పలువురు ముఖ్యమంత్రి పర్యటించినప్పటికీ.. కొమురం భీం పుట్టిన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో పర్యటిస్తున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం గమనార్హం. అయితే ఆయన పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇంద్రవెల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చడంపై ఆదివాసీ సంఘాలు ఆశలు పెట్టుకున్నాయి. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో హక్కులన్నీ ఆదివాసులకు మాత్రమే దక్కాలి. కానీ మారుతున్న సామాజిక పరిస్థితుల్లో దృష్ట్యా.. ఆదివాసేతర సమూహాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. వలస లంబాడాలతో పాటు ఇతర అగ్రవర్ణ కులాలు, మైనారిటీలు ఆదిమ గిరిజన ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోతున్నారు.
దీనిపై ఆదిమ గిరిజన సంఘాలు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ వారికి దక్కాల్సిన ఫలితం రావడం లేదు. అయితే రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభలో ఇచ్చిన హామీ మేరకు అడవిపై హక్కు కోసం ఇప్పుడు కూడా ఆదివాసీ సంఘాలు ఉద్యమం చేస్తూనే ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా గతంలో ఆదివాసులకు ఇచ్చిన హామీలపై వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధానంగా ఆదివాసులకు భూమి పట్టాలు...పోడు భూముల సమస్య పరిష్కారం, ఏజెన్సీ ప్రాంతంలో ఆదిమ గిరిజనులకే ఉద్యోగాల హక్కు వంటి ప్రధాన సమస్యలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర సమూహాలు ఇష్టారాజ్యంగా గృహ నిర్మాణాలు, వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్న తీరుపై అనేక ఆరోపణలు ఫిర్యాదు ఉన్నాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
సీఎం ఆసిఫాబాద్ పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సోమవారం ఆసిఫాబాద్ జిల్లాలో ఖరారైంది. సాయంత్రం 5:45 గంటలకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామానికి సీఎం చేరుకుంటారు. 38 ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు అనంతరం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ చేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 7 గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌కు చేరుకుంటారు అక్కడ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం కాగజ్‌నగర్ నుంచి బయలుదేరి మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసానికి వెళతారు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్ పయనమవుతారు.






