- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెనుక రాజకీయ వ్యూహం.. వాళ్లే సీఎం టార్గెట్?
రాష్ట్రంలో టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ ఓటు బ్యాంకును తనవైపునకు తిప్పుకోవాలనే స్ట్రాటజీలో సీఎం రేవంత్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ ఓటు బ్యాంకును తనవైపునకు తిప్పుకోవాలనే స్ట్రాటజీలో సీఎం రేవంత్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సీఎం హాజరయ్యారనే చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీని తెలంగాణలోనూ బలోపేతం చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అవకాశం లేకుండా ఇక్కడ ఉన్న టీడీపీ సానుభూతిపరులను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలకు తెరలేపారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
సొంత మనుగడకే రేవంత్ ప్రయారిటీ
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించి సీఎంగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పటికీ చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటారని రేవంత్ రెడ్డిపై విమర్శలు ఉన్నాయి. రాజకీయాల్లో సొంత మనుగడకు ఇబ్బంది లేనంత వరకే ఎదుటివారితో క్లోజ్‌గా ఉంటారు. ఒకసారి సదరు సన్నిహితులతో సమస్య వస్తుందనుకుంటే ప్రత్యర్థిగా చూడటం మొదలు పెట్టి, వారితోనే తలపడటం సహజం. రానున్న రోజుల్లో టీడీపీ రాష్ట్రంలో యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నది. బీజేపీతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్.. దీనికి అడ్డుకట్టే వేయాలని వ్యూహం రచిస్తున్నట్టు టాక్.
టీడీపీ ఓటు బ్యాంకుకు గాలం
ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి సానుభూతిపరులు, సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకునే టీడీపీ ఇక్కడ తన కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తున్నది. అంతకుముందే ఆ పార్టీ సానుభూతిపరులు, ఓటు బ్యాంకును తనవైపునకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుకే హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లి ఆయన సేవలను కొనియాడారు. దీంతో సెటిలర్స్ మొత్తం తన పట్ల, తన ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటారనే అంచనాలో ఆయన ఉన్నట్టు తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని సెటిలర్స్ ఏకపక్షంగా ఓటు వేయడంతో బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రాంతంలో మెజార్టీ సీట్లు వచ్చాయి. కానీ, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో మాత్రం వారు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. ఇదే తరహాలో మిగతా నియోజకవర్గాల్లోని ఓటు బ్యాంకును సైతం తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్లాన్‌లో రేవంత్ ఉన్నట్లు తెలిసింది.
స్థానిక పార్టీల వైపే సెటిలర్ల మొగ్గు
సహజంగా సెటిలర్లు తాము ఉంటున్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అలాంటి భరోసా ఇచ్చే పార్టీల వైపు మొగ్గుచూపుతారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే రుజువైంది. ఆనాడు బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. దీంతో సెటిలర్లు తమ వైపు మొగ్గుచూపుతారని కూటమి నేతలు ఆశించారు. కానీ, వారంతా బీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. ఎందుకంటే సెటిలర్లకు బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ప్రయారిటీ ఇవ్వడంతో పాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సపోర్టుగా నిలిచింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సీఎం రేవంత్ టీడీపీ సానుభూతిపరులను తనవైపు తిప్పుకునేందుకు ప్లాన్ వేసినట్టు చర్చ జరుగుతున్నది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని కమ్మ సామాజిక వర్గం నేతలతో రెగ్యూలర్‌గా సమావేశాలు నిర్వహించడం, కొందరికి పదవులు సైతం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో వారంతా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు కాకుండా కాంగ్రెస్ వెంటే ఉంటారనే అంచనాలో రేవంత్ ఉన్నట్లు సమాచారం.






