తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2026-04-21 10:55:30  IST  )

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే (NDA) అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని, తమిళ గడ్డపై జన్మించిన రామానుజన్, అబ్దుల్ కలాం, ఎం.ఎస్. స్వామినాథన్ వంటి మహనీయులు దేశానికే గర్వకారణమని కొనియాడారు. తమిళనాడు అభివృద్ధి ఆగిపోయిందని, గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలంటే మార్పు అవసరమని, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

డీలిమిటేషన్‌పై స్పష్టత..

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న విపక్షాల ఆరోపణలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచినప్పుడు సీట్లు ఎలా తగ్గుతాయని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో స్థానాలు 39 నుండి 59కి, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుండి 38కి పెరుగుతాయని, ఈ విషయంలో కాంగ్రెస్, డీఎంకేలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న వారు మహిళా సాధికారత గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, డీలిమిటేషన్ విషయంలో సీట్లు తగ్గవనడానికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు అడ్డుకోండి.. చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ

Next Story